చంద్రబాబుతో దోస్తీ అంతవరకే... జగన్ కోసం కాంగ్రెస్ వ్యూహం ?

జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటంలో చంద్రబాబును కలుపుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ... వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం కూడా తలుపులు తెరిచే ఉంచినట్టు పరిణామాలను బట్టి అర్థమవుతోంది.

news18-telugu
Updated: April 18, 2019, 4:50 PM IST
చంద్రబాబుతో దోస్తీ అంతవరకే... జగన్ కోసం కాంగ్రెస్ వ్యూహం ?
రాహుల్ గాంధీ, చంద్రబాబు, వైఎస్ జగన్
news18-telugu
Updated: April 18, 2019, 4:50 PM IST
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. ఈ విషయం అనేకసార్లు రుజువైంది కూడా. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే నేతలు సైతం కాలక్రమంలో మళ్లీ కలిసిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ... తాజాగా జాతీయస్థాయిలో ఆ పార్టీతో కలిసి పని చేస్తున్న దృశ్యాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు ఏం చెప్పినా... జాతీయ స్థాయిలో తన అవసరాల కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. చంద్రబాబుతో స్నేహం చేయడానికి ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ... అదే సమయంలో విపక్ష వైసీపీని కూడా వదులుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ వ్యూహాలను బట్టి అర్థమవుతోంది.

ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోని టీడీపీ అధినేత చంద్రబాబు... ఆ పార్టీతో స్నేహం జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ సైతం చంద్రబాబుతో అతిగా స్నేహం చేసి వైసీపీని దూరంగా చేసుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ కారణంగానే ఏపీలో ఎన్నికలు జరిగిన తీరును ఆ పార్టీ నేతలు అంత విమర్శించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో ఈవీఎంలపై విపక్షాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఏపీలో మాత్రం టీడీపీ వినిపిస్తున్న గళానికి మద్దతు ఇవ్వడం లేదు.

అయితే ఎన్నికల తరువాత జాతీయస్థాయిలో వైసీపీతో అవసరం వస్తుందేమో అనే ముందుజాగ్రత్త కారణంగానే కాంగ్రెస్ ఈ రకమైన వైఖరి అవలంభిస్తుందేమో అనే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు తాను కాంగ్రెస్ పార్టీని క్షమించానని వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం చేసిన ప్రకటన కూడా ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి మారడానికి ఓ కారణం కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటంలో చంద్రబాబును కలుపుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ... వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం కూడా తలుపులు తెరిచే ఉంచినట్టు పరిణామాలను బట్టి అర్థమవుతోంది.First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...