సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఫలితాల అనంతర పరిణామాలతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా కీలక ప్రకటన చేశారు. పార్టీ అధికార ప్రతినిధులెవరూ మీడియా ఛానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాలకు వెళ్లొద్దని కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఆదేశించారు. అలాగే మీడియా కూడా చర్చలకు తమ పార్టీ వారిని పిలవవద్దని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ రాజీనామాపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాకుండా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మీడియాలో అనేక ఊహాజనిత కథనాలు వెలువడుతుండటంతో పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై నేతలు నోరు జారితే అనవసర చిక్కులు తలెత్తే అవకాశముందని గ్రహించిన పార్టీ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, సూర్జేవాలా వ్యాఖ్యలు నైరాశ్యానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోలేదని, ఆ ప్రభావం పార్టీ మీద పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వైఫల్యం నుంచి బయటపడేందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నందునే కాంగ్రెస్ మీడియాతో దూరం పాటించాలని కోరుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.