కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆగ్రా కోర్టులో కేసు నమోదైంది. దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందుపరచడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది నరేంద్ర శర్మ కోర్టును ఆశ్రయించారు. నరేంద్ర శర్మ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఏప్రిల్ 16న విచారణ జరపనుంది.

అసలు రాహుల్ గాంధీ ఏం చెప్పదలుచుకున్నారు. ఉగ్రవాదులంతా దేశంలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నారా?.. దేశ ద్రోహ చట్టాన్ని గనుక తొలగిస్తే.. దేశంలో పరిస్థితులు అద్వాన్నంగా తయారవుతాయి.
— నరేంద్ర శర్మ,న్యాయవాది
కాగా, భారత శిక్షాస్మృతిలోని దేశ ద్రోహ చట్టం 124A ప్రకారం.. లిఖితపూర్వకంగా గానీ మాటల ద్వారా గానీ లేదా సంకేతాల ద్వారా గానీ, లేదా మరే రూపంలో విద్వేషాన్ని లేదా ధిక్కారాన్ని ప్రదర్శించినా లేదా ప్రదర్శించడానికి ప్రయత్నించినా, చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వం పట్ల అవిధేయతను చూపించినా, లేదా చూపించడానికి ప్రయత్నించినా అది దేశద్రోహం కిందకు వస్తుంది. అయితే ఈ చట్టాన్ని యూనివర్సిటి విద్యార్థి నాయకులు, మేధావులు, ప్రతిపక్ష నేతలపై ప్రయోగించి నిరసనలను అణిచేయడం దారుణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో 124A రద్దు హామీని పొందుపరిచింది.