COMPETITION BETWEEN JANASENA AND BJP IN VIJAYAWADA MUNICIPAL CORPORATIONS DESPITE ALLIANCE HERE ARE THE DETAILS PRN
AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మారిన సీన్... అక్కడ జనసేన వర్సెస్ బీజేపీ
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)మున్సిపల్ ఎన్నికల్లో (AP Municipal Elections) చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీల వ్యవహారం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో జనసేన (Janasena)-బీజేపీల (Bharathiya Janatha party) మధ్య పొత్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీల వ్యవహారం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో జనసేన-బీజేపీల మధ్య పొత్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సిన మిత్రులు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు పోటీకి నిలబడ్డారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీలు కలిసి బరిలో దిగాయి. ఇరుపార్టీల నేతలు ఏకాభిప్రాయంతో సీట్లను పంచుకొని అభ్యర్థులను పోటీలోకి దించారు. ఐతే కొన్నిచోట్ల మాత్రం జనసేన-బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు పోటీకి దిగారు. ఇది ఫ్రెండ్లీ పోటీ అని పైకి చెప్తున్నా.. ఎవరిబలమెంతో తేల్చుకోవడానికే పోటీచేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉన్న కొన్ని చోట్ల ఇరు పార్టీల అభ్యర్థులు పోటీపడుతున్నారు. అదేంటని ప్రశ్నించిన వారికి విచిత్రమైన సమాధానం ఎదురవుతోంది. మా మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోందని రెండు పార్టీల నేతలు చెప్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో పార్టీ ముఖ్యనేతలు సమావేశమై ఉమ్మడిగా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులపై ఓ నిర్ణయం తీసుకున్నారు. 37 డివిజన్లను జనసేన, మిగిలిన 27 డివిజన్లలో బీజేపీ పోటీ చేయాలని బావించారు. ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లోని ఏడు డివిజన్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. దీంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి వివాదానికి ముగింపు పలికారు. ఫైనల్ గా జనసేన 38 డివిజన్లకు అభ్యర్థులను , బీజేపీ 23 మంది అభ్యర్థులను ప్రకటించింది . బీజేపీ తొలుత 20 మందితో ఒక జాబితా విడుదల చేయగా , కొద్దిరోజుల క్రితం మరో ముగ్గురిని ప్రకటించింది . అయితే నాలుగు డివిజన్లలో మాత్రం మిత్ర పార్టీలకు చెందిన బీజేపీ , జనసేన అభ్యర్దులు ఇద్దరూ పోటీ చేస్తుండటం విశేషం.
తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్ను బీజేపీ కేటాయించగా.. ఇక్కడ ఆ పార్టీ తరపున పల్లవరాజు పోటీ చేస్తుండగా, జనసేన నుంచి G.జయరామ్ బరిలో ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ లో బీజేపీ నుంచి నాగలక్ష్మి పోటీలో ఉండగా , జనసేన నుంచి లక్ష్మీ పోటీ చేస్తున్నారు. 28 వ డివిజన్లో జనసేన తరపున రాజేష్ నందు పోటీలో ఉండగా బీజేపీ నుంచి జయరామ్ బరిలో దిగారు. 32వ డివిజన్ జనసేనకు కేటాయించడంతో ఆపార్టీ తరపున రత్న కమల్ కిరణ్ పోటీలో ఉన్నారు. ఇదే డివిజన్లో బీజేపీ నుంచి శ్రీనివాసరాజు పోటీకి సై అన్నారు.
ఇక 64వ డివిజన్ పంపకాల్లో భాగంగా బీజేపీకి వెళ్లింది. ఐతే ఇక్కడ పోటీలో ఉన్న కళ్లేపల్లి హారిక నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమెకు వివాహం నిశ్చమవ్వడంతో వెనక్కితగ్గారు. ఆ తర్వాత ఈ డివిజన్ జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఆ పార్టీ తరఫున భోగేశ్వరిని పోటీకి దింపారు. 64వ డివిజన్ను మినహాయిస్తే మిగిలిన నాలుగు డివిజన్లలో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ రెండు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండడం విచిత్రం. అయితే తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని కేవలం ఫ్రెండ్లీ పోటీ మాత్రమేనని చెప్తున్నారు. ఐతే ఫ్రెండ్లీ పోటీ పేరుతో ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే ఇతర పార్టీలకు ప్లస్ అవుతుందన్న లాజిక్ ను రెండు పార్టీలు మిస్సయ్యాయని బెజవాడ బెంజి సర్కిల్లో చర్చ నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.