గంగుల గరం గరం.. ఈటల మాటల తూటాలు.. అధికార పార్టీలో రాజుకుంటున్న కరీంనగర్ ముసలం..

గంగుల కమలాకర్ - ఈటల రాజేందర్ (ఫైల్)

Eatala Rajender - Gangula Kamalakar: కొంతకాలంగా ఒక మంత్రి ఒకే నియోజకవర్గానికే పరిమితం అయితే.. ఇంకొకరు మాత్రం అన్నీ తానై జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఒకప్పుడు వీరిరువురి మధ్య సఖ్యతే ఉన్నా ఇప్పుడు మాత్రం ఉప్పు నిప్పులా మారారు. ఎవరా ఇద్దరు మంత్రులు..? వారిద్దరికేమైంది..?

 • News18
 • Last Updated :
 • Share this:
  రెండు కత్తులు ఒకే ఒరలో ఇముడలేవని ఒక సామెత. అచ్చం అలానే ఉంది కరీంనగర్ జిల్లాలోని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు పరిస్థితి. బయటకు మాత్రం ఐక్యంగా ఉన్నా అంతర్గతంగా రగిలిపోతున్నారు. కొంతకాలంగా ఒక మంత్రి ఒకే నియోజకవర్గానికే పరిమితం అయితే.. ఇంకొకరు మాత్రం అన్నీ తానై జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఎవరా ఇద్దరు మంత్రులు..? వారిద్దరికేమైంది..? మంత్రుల మధ్య ఆధిపత్య పోరులో లాభమెవరికి..? నష్టమెవరికి..?

  ఉద్యమ ఖిల్లా కరీంనగర్ జిల్లా అధికార టీఆర్ఎస్ పార్టీకి పుట్టినిల్లు.. పార్టీ పురుడు పోసుకున్నది కరీంనగర్ గడ్డ మీదనే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ప్రభుత్వ ఏర్పాటు వరకు కరీంనగర్ సెంటిమెంట్ కలిసి రావడంతో గులాబీ దళపతి సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో కరీంనగర్ జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. రెండవసారి అధికారంలోకి వచ్చాక ఏ జిల్లాకు ఇవ్వని ప్రాధాన్యత కరీంనగర్ జిల్లా కు ఇచ్చారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు (గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్) మంత్రి పదవులు కట్టబెట్టారు. కొంతకాలం దాకా వీరిద్దరి మధ్య సంబంధాలు భాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో వీళ్లు ఉప్పు నిప్పులా మారారు. మంత్రుల మధ్య ఐక్యత లోపించిందని ప్రచారం జోరుగా సాగుతోంది.

  గతంలో ఉమ్మడి జిల్లాలో మంత్రులుగా ఈటల,కేటీఆర్, ఉండగా ఈసారి ఉమ్మడి జిల్లాలో గంగుల తో పాటు, కొప్పుల ఈశ్వర్ కి ఛాన్స్ ఇచ్చారు. కేటీఆర్ రాజన్న సిరిసిల్ల కు ప్రాతినిధ్యం వహిస్తుండగా కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరీంనగర్ జిల్లా నుండి గంగుల, ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంగుల కమలాకర్ మంత్రి అయినప్పటి నుంచి ఈటల హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. నియోజకవర్గం లో ఏదైనా కార్యక్రమాలు ఉంటే హైదరాబాద్ నుండి నేరుగా హుజురాబాద్ కు వచ్చి వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో, జిల్లాలోని ఏదైనా కార్యక్రమాలు ఉంటే పాల్గొనకుండా నియోజకవర్గానికి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు.

  మరోవైపేమో జిల్లా కేంద్రంలో ఉంటున్న మంత్రి గంగుల కమలాకర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తాజాగా పార్టీ సభ్యత్వానికి జిల్లా నేతలందరూ హాజరైనా.. ఈటెల మాత్రం హాజరుకాలేదు. అంతకంటే ఒక రోజు ముందే జమ్మికుంటలో విడిగా పార్టీ సమావేశం పెట్టి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. మిగతా జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ.. కరీంనగర్ లో మాత్రం ఇద్దరు మంత్రులు వేర్వేరుగా పార్టీ సభ్యత్వ నమోదు చేయించడం పార్టీలో కలకలం రేపుతున్నది.

  కొంతకాలంగా ఈటల, గంగుల మధ్య సఖ్యత లోపించిందని అంతర్గత విభేదాలు పెరిగాయని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ వ్యవహారం గురించి గులాబి శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ఏ మంత్రి వెంట ఉంటే ఏ మంత్రి ఏమనుకుంటాడో..? అని పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గతంగా కుమిలిపోతున్నారు. కగా మంత్రుల వ్యవహార శైలితో పార్టీ నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోతున్నారు అని టాక్ స్థానికంగా వినబడుతుంది. జిల్లా కేంద్రంతో సంబంధం లేకుండా ఈటల నియోజకవర్గానికే పరిమితం కావడంతో ప్రాధాన్యత తగ్గిందా..? లేక కావాలనే అంటీ ముట్టనట్లు గా వ్యవహరిస్తున్నారా..? అని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నారు.

  దీనికి తోడుగా అవకాశం దొరికినప్పుడల్లా ఈటల మాటల తూటాలు పేలుస్తూ ఉండటంతో కొత్త చర్చకు దారితీస్తుంది. ఈ పరిణామాలు పార్టీకి ఇబ్బందికి కారణమని వాదన వినిపిస్తుంది. కానీ జిల్లాకు చెందిన అగ్రనేతలు మాత్రం పార్టీ లో అందరూ ఒకే తాటిపై ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.. ఇది ఇలా ఉంటే ఈటెల పార్టీ పెడతారని పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ఇటీవలే గంగుల కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా పలు సంచలనాలకు వేదికైన కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల మధ్య పొడచూపిన అంతర్గత విబేధాలు ఏ స్థాయికి తీసుకెళ్తాయో..? దాని వల్ల పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందో అని సగటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: