YS Jagan: అనూహ్యం.. సీఎం జగన్ యూటర్న్.. ఆ విషయంలో వెనక్కి..!

నెక్ట్స్ ఎన్నికలు జరిగితే.. ఈ ఎమ్మెల్సీ సీట్లన్నీ వైసీపీ ఖాతాలోకే వెళ్తాయి. జగన్ మరో ఏడు నెలలు ఓపిక పడితే మండలిలో వైసీపీ బలం పెరుగుతుంది. అప్పుడు తమ నిర్ణయాలకు గతంలో మాదిరి బ్రేకులు పడే అవకాశం లేదు.

news18-telugu
Updated: November 22, 2020, 8:48 PM IST
YS Jagan: అనూహ్యం.. సీఎం జగన్ యూటర్న్.. ఆ విషయంలో వెనక్కి..!
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
పాలనలో ఏపీ సీఎం జగన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తూ.. ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. తాను చేయాలనుకునే కార్యక్రమాలను ఖచ్చితంగా చేసి తీరుతున్నారు సీఎం జగన్. విపక్షాలు విమర్శలు గుప్పించినా.. కోర్టులు బ్రేకులు వేసినా.. తాను అనుకున్నది సాధిస్తున్నారు. నవరత్నాల అమలు నుంచి మూడు రాజధానుల వరకు.. అన్నింటా ఇదే పంథాలో దూసుకెళ్తున్నారు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు సీఎం జగన్. అదే శాసన మండలి రద్దు.

మూడు రాజధానుల విషయంలో గత ఏడాది మండలి వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. సీఆర్డీయే రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించినప్పటికీ.. శాసన మండలిలో మాత్రం బ్రేకులు పడ్డాయి. తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఆ రెండు బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ అడ్డుకున్నారు. సెలెక్ట్ కమిటీకి పంపించారు. కానీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఐతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి.. వాటిని ఆమోదింపజేసుకొని.. పంతం నెగ్గించుకున్నారు సీఎం జగన్.

ఆ తర్వాతే సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులకు అడ్డుపడిన మండలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఏకంగా మండలినే రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. ఈ ఏడాది జనవరి 27న మంత్రివర్గంలో ఆమోదించి.. ఫిబ్రవరిలో ఆ బిల్లుని శాసనసభలో ఆమోదించారు. అనంతరం పార్లమెంటుకి పంపించారు. మండలి వల్ల ఎలాంటి లాభం లేదని.. ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వాల్సిన మండలి.. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపడుతోందని విమర్శించారు. మేధావులు ఉండాల్సిన మండలి.. రాజకీయాలకు వేదికవుతోందని ఆనాడు అన్నారు జగన్. ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు వృథా అవుతోందని.. అందుకే మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడా నిర్ణయంపై వెనకడుగు వేస్తున్నారు.

మండలి రద్దుపై యూటర్న్..!
ఇటీవల కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. ఆయన మరణంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు వస్తున్నాయి. ఉపఎన్నికల్లో ఆ సీటును.. దివంగత ఎంపీ దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకు కాకుండా గురుమూర్తి అనే వైద్యుడికి కేటాయించారు సీఎం జగన్. అదే సమయంలో దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ ఇస్తామని వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. మరి చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారంటే.. మండలి ఉండాలి కదా. అంటే.. ఈ లెక్కన 'మండలి రద్దు' నిర్ణయాన్ని జగన్ యూటర్న్ తీసుకున్నట్లు భావించాల్సి వస్తుంది.

జగన్ వ్యూహం ఇదేనా..?
ఏపీ శాసన మండలిలో పలువురి పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతుంది. టీడీపీ ఎమ్మెల్సీలు సంధ్యారాణి, షరీఫ్, తిప్పేస్వామి, చౌదరితో పాటు మరో 10 మంది పదవీ కాలం 2021 జూన్ నాటికి ముగుస్తుంది. వీటిలో ఎక్కువ సీట్లు ఎమ్మెల్యేల కోటా, స్థానిక సంస్థల కోటాకు చెందినవే ఉన్నాయి. నెక్ట్స్ ఎన్నికలు జరిగితే.. ఈ ఎమ్మెల్సీ సీట్లన్నీ వైసీపీ ఖాతాలోకే వెళ్తాయి. జగన్ మరో ఏడు నెలలు ఓపిక పడితే మండలిలో వైసీపీ బలం పెరుగుతుంది. అప్పుడు తమ నిర్ణయాలకు గతంలో మాదిరి బ్రేకులు పడే అవకాశమే ఉండదు.

మరోవైపు పార్టీలో ఎంతో మంది నేతలకు సీఎం జగన్ పదవులు ఇవ్వాల్సి ఉంది. వాటిని ఎమ్మెల్సీల రూపంలో భర్తీ చేసుకోవచ్చు. ఇప్పటికే అనేక మందికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. తాజాగా దివంగత ఎంపీ కుమారుడు కల్యాణ చక్రవర్తికి కూడా ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. పండుల రవీంద్రబాబు, జకియా ఖానుమ్, డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు ఇటీవలే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఒకవేళ మండలి రద్దయితే వీరికి పదవులు ఉండవు. ఈ పరిణామాల నేపథ్యంలో మండలి రద్దు నుంచి సీఎం జగన్ వెనక్కి తగ్గినట్లు స్పష్టమవుతోంది. దీనిపై మరికొన్ని రోజుల్లోనే స్పష్టత రానుంది.
Published by: Shiva Kumar Addula
First published: November 22, 2020, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading