news18-telugu
Updated: January 26, 2020, 9:46 PM IST
వైఎస్ జగన్ (File)
ఏపీ శాసనమండలిని రద్దు చేయాలనే నిర్ణయానికి సీఎం జగన్ దాదాపుగా వచ్చేశారు. సోమవారం ఇందుకు సంబంధించి కేబినెట్ నిర్ణయంతో పాటు అసెంబ్లీ తీర్మానం కూడా జరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సొంత పార్టీ నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అయితే శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న వెంటనే కేంద్రం తీసుకోదని... పార్లమెంట్ వెంటనే దీన్ని ఆమోదించదని టీడీపీ నేతలు చెబుతున్నారు. మండలి రద్దు ప్రక్రియ పూర్తి కావాలన్నా... దాదాపు రెండేళ్లు పడుతుందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
దీంతో రాష్ట్రస్థాయిలో మండలి రద్దు కోసం నిర్ణయం తీసుకోబోతున్న ఏపీ సీఎం జగన్... ఢిల్లీ స్థాయిలో ఈ ప్రక్రియ వేగవంతమయ్యేందుకు చర్యలు తీసుకుంటారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. మూడు రాజధానుల నిర్ణయం తమ పరిధిలోకి రాదని కేంద్రం స్పష్టం చేసింది. అది రాష్ట్రాల పరిధిలోని అంశమని వ్యాఖ్యానించింది. అయితే మండలి రద్దులో కీలక నిర్ణయం కేంద్రానిదే. రాష్ట్రం నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాల్సింది కూడా కేంద్రం, పార్లమెంటే. దీంతో కేంద్రంలోని అధికార పార్టీ కచ్చితంగా అనుకుంటేనే జగన్ పంతం నెరవేరుతుంది.
అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్రం వెంటనే ఓకే చెబుతుందా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం సీఎం జగన్ మోదీ, అమిత్ షాలను ఏ రకంగా కన్విన్స్ చేస్తారన్నది కూడా ప్రశ్నార్థకమే. మొత్తానికి మండలి విషయంలో దూకుడుగా ముందుకు వెళుతున్న సీఎం జగన్... ఢిల్లీ స్థాయిలో దీనిపై ఏం చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:
Kishore Akkaladevi
First published:
January 26, 2020, 9:46 PM IST