చంద్రబాబు కడుపుమంటకు చికిత్స లేదన్న సీఎం జగన్

కర్నూలు సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

news18-telugu
Updated: February 18, 2020, 4:46 PM IST
చంద్రబాబు కడుపుమంటకు చికిత్స లేదన్న సీఎం జగన్
కంటి వెలుగు కార్యక్రమంలో కళ్ల జోళ్లను పరిశీలిస్తున్న సీఎం జగన్
  • Share this:
కర్నూలులో వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశను ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తాము సుపరిపాలన అందిస్తుంటే... వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చంద్రబాబు, టీడీపీ తీరును తప్పుబట్టారు. ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు పైగా చికిత్స చేస్తున్నామని...ఇంకా క్యాన్సర్‌కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉందని అన్నారు. కానీ, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదని వ్యాఖ్యానించారు. కంటిచూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ, చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదని సీఎం జగన్ విమర్శించారు.

వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ, మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేనే లేదని సీఎం జగన్ అన్నారు. అలాంటి లక్షణాలున్న మనుషులను మహానుభావులుగా చూపించే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. వాటిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో తీర్చిదిద్దబోతున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

పేదలు వెళ్లే ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దబోతున్నామని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మేలు చేస్తున్నామని వివరించారు. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తున్నామని తెలిపారు.

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏఎహెచ్‌లు, డీహెచ్‌లతో పాటు, టీచింగ్‌ ఆస్పత్రులను కూడా మార్చబోతున్నామని... దీని కోసం రూ.15,335 కోట్లతో పనులు చేపడుతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మొత్తం 175 నియోజకవర్గాలలో వచ్చే జూలై 31 వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఆపరేషన్లు అవసరమైతే మార్చి 1 నుంచి 133 కేంద్రాలు, 11 టీచింగ్‌ ఆస్పత్రులు, 13 జిల్లా ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు, 81 ఎన్జీఓ కంటి ఆస్పత్రుల్లో కంటి శస్త్ర చికిత్సలు జరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు.



First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు