news18-telugu
Updated: October 21, 2019, 7:57 PM IST
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి... ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్న విషయంలో ఎవరికీ అంతగా స్పష్టత లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అంశంపై గతంలో వచ్చిన ఊహాగానాలకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. దీనిపై అందరితో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇదిలా ఉంటే రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల విభజన విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉండనుందనే దానిపై సరికొత్త ప్రచారం మొదలైంది. గ్రేటర్ రాయలసీమలో భాగమైన 6 జిల్లాలను కాస్తా 12 జిల్లాలుగా చేయాలన్న యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా, అనంతపురం జిల్లాను రెండు జిల్లాలుగా, చిత్తూరు జిల్లాను మూడు జిల్లాలుగా, వైఎస్సార్ కడప జిల్లాను రెండు జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పది జిల్లాలకు తోడు గ్రేటర్ రాయలసీమలో భాగమైన నెల్లూరు, ప్రకాశం జిల్లాలు యధావిధిగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక జనాభా, ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల ఆధారంగా జిల్లాల విభజన ఉండనున్నట్లు తెలిసింది.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలను ముందుగా ఏర్పాటు చేయాలా లేక పరిషత్ ఎన్నికలను ముందుగా నిర్వహించాలా అనే దానిపై తేల్చుకోలేక వైసీపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముందే ఎన్నికలు జరిపితే, ఆ తరువాత పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా చేసుకొని ఏర్పాటు చేసే కొత్త జిల్లాల పాలనలో సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి గ్రేటర్ రాయలసీమలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల విషయంలో ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
October 21, 2019, 7:57 PM IST