కాకాణి, కోటంరెడ్డికి జగన్ ఒకే ఒక్క మాట.. పంచాయతీ సెటిల్

సీఎం జగన్ తో భేటీ తర్వాత బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు కాకాణి, కోటంరెడ్డి.. పార్టీ కోసం తాము కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: October 9, 2019, 8:28 PM IST
కాకాణి, కోటంరెడ్డికి జగన్ ఒకే ఒక్క మాట.. పంచాయతీ సెటిల్
వైఎస్ జగన్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి
  • Share this:
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన తొలి వివాదానికి సీఎం జగన్ తనదైన శైలిలో ముగింపు పలికారు. ఓ లే అవుట్ కు అనుమతుల విషయంలో నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదంతో వైసీపీ పరువు బజారున పడుతుందని భావించిన జగన్.. ఇవాళ ఇద్దరినీ తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. వివాదానికి దారి తీసిన పరిస్దితులపై ఆరా తీశారు. చివరికి త్వరలో జరిగే స్ధానిక పోరు కోసం కలిసి మెలసి పనిచేయాలని హెచ్చరికలు చేసి పంపారు. నెల్లూరు జిల్లాలో ఓ లే అవుట్ కు అనుమతుల వ్యవహారంలో సర్వేపల్లి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డితో తలెత్తిన వివాదంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరుకు పడ్డారు. ముఖ్యంగా లే అవుట్ కు అనుమతులు ఇవ్వనందుకు కోటంరెడ్డి తనను బెదిరించారంటూ వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లడంతో ఈ వివాదం కాస్తా సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. సీఎం ఆదేశాల మేరకు కోటంరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు... చివరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అయితే ఈ మొత్తం వివాదంపై సీరియస్ గా ఉన్న సీఎం జగన్ తో ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతలతో సుదీర్ఘంగా చర్చించిన జగన్... పార్టీ పరువు తీయొద్దని సుతిమెత్తగా హెచ్చరికలు చేశారు. త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరువురు నేతలు కలిసి పనిచేయాలని సూచించారు.

సీఎం జగన్ తో భేటీ తర్వాత బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు కాకాణి, కోటంరెడ్డి.. పార్టీ కోసం తాము కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అయితే జిల్లాలో తలెత్తిన వివాదంపై సీఎంతో సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని, ఈ నెల 15న నెల్లూరులో రైతు భరోసా ప్రారంభోత్సవం, ఏర్పాట్లపై మాత్రమే చర్చించినట్లు ఇద్దరూ చెప్పుకొచ్చారు. సభను బాగా నిర్వహించాలని జగన్ తమను కోరినట్లు ఇద్దరూ వెల్లడించారు. ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదుపై విలేకరులు అడిన ప్రశ్నకు స్పందించిన కోటంరెడ్డి... ఈ కేసు అవాస్తమని తాను ఎప్పుడో చెప్పానన్నారు. ఎమ్మెల్యే కాకాణి తన మేనత్త కొడుకని, తాజాగా జరిగిన రొట్టెల పండుగకు ఆయన ఇంటికి కూడా వెళ్లానని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. తమ మధ్య విభేదాలు తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కాకాణి కూడా దాదాపు ఇవే మాటలు వల్లెవేశారు. విభేదాలు వస్తే పరిష్కరించుకునే సాన్నిహిత్యం తమ మధ్య ఉందని, కొందరు కావాలనే తమ మధ్య గొడవలు సృష్టిస్తున్నారని కాకాణి పేర్కొన్నారు. కోటంరెడ్డి తన బావమరిది అని, చిన్నప్పటి నుంచి తామిద్దరూ స్నేహితులమని కూడా కాకాణి చెప్పుకొచ్చారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్ 18)

హోమ్ లోన్‌పై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ
Published by: Ashok Kumar Bonepalli
First published: October 9, 2019, 8:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading