news18-telugu
Updated: October 10, 2019, 3:55 PM IST
మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్(ఫైల్ ఫోటోలు)
సైరా సినిమాతో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించిన మెగాస్టార్ చిరంజీవి... ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వారం క్రితం విడుదలై మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాను చూడాలని మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు చిరంజీవి, రామ్ చరణ్‌కు సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. చిరంజీవి స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తుండటంతో... సీఎం జగన్ కూడా సైరా సినిమాను చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే సీఎం జగన్ సైరా సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో... ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే సైరా సినిమా నిర్మాతలకు భారీగా ఊరట లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘సైరా’ షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్,చిరంజీవి ( Twitter/Photo)
గతంలో ఈ రకమైన చారిత్రాత్మకమైన కథాంశంతో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో... చిరంజీవి సైరా విషయంలోనూ సీఎం జగన్ ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి ఆయనను కలవబోతున్న మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం గుడ్ న్యూస్ వినిపిస్తారేమో చూడాలి.
Published by:
Kishore Akkaladevi
First published:
October 10, 2019, 3:55 PM IST