జగన్‌ నిర్ణయానికి కేంద్రం జై... స్పష్టమైన సంకేతాలు ?

ప్రధాని మోదీతో సీఎం జగన్(ఫైల్ ఫోటో)

వైసీపీ తరపున ఏపీ నుంచి నలుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేసిన సీఎం జగన్... ఇద్దరు మంత్రులకు కూడా ఈ మేరకు అవకాశం కల్పించారు.

 • Share this:
  ఏపీలో శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం... ప్రస్తుతం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది. శాసనసభ తీర్మానంతో కేంద్రానికి చేరిన ఈ తీర్మానంపై మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని గతంలో పలువురు బీజేపీ నేతలు కూడా అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో తీసుకున్న ఓ నిర్ణయంతో... శాసనమండలి రద్దుపై క్లారిటీ వచ్చినట్టే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  వైసీపీ తరపున ఏపీ నుంచి నలుగురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేసిన సీఎం జగన్... ఇద్దరు మంత్రులకు కూడా ఈ మేరకు అవకాశం కల్పించారు. శాసనమండలి రద్దు కారణంగా మంత్రి పదవులు కోల్పోయే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. వైసీపీకి ఉన్న బలాన్ని బట్టి వీరిద్దరూ పెద్దల సభకు ఎన్నిక కావడం లాంఛనమే. అయితే వీరిని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా సీఎం జగన్ మరో సంకేతం కూడా ఇచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు.

  ఏపీ శాసనమండలి రద్దుకు బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం ఆమోదం తెలుపుతుందని... ఈ కారణంగానే సీఎం జగన్ ఇద్దరు మంత్రులను ముందుగానే రాజ్యసభకు పంపించారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు శాసనమండలి రద్దు విషయంలో తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ఉన్నాననే విషయాన్ని చెప్పేందుకే సీఎం జగన్ ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపించారనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులను రాజ్యసభకు పంపించిన సీఎం జగన్‌... కేంద్రం నుంచి ముందస్తు సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
  Published by:Kishore Akkaladevi
  First published: