కరోనా కారణంగా చాలాకాలం నుంచి సీఎం జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారం వంటి కార్యక్రమాలకు కూడా ఆయన వెళ్లలేదు. దీంతో మళ్లీ ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వెళతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా దీనిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నుంచి మళ్లీ తాను ప్రజల్లోకి వెళతానని సీఎం జగన్ వెల్లడించారు. బుధవారం జరిగిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు క్రమం తప్పకుండా గ్రామ సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సూచించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి తాను కూడా గ్రామ సచివాలయలను సందర్శిస్తానని తెలిపారు. ప్రతి నెల చివరి శుక్ర, శని వారాల్లో సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమం చేపడతామని అన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమని సీఎం జగన్ తెలిపారు. ఈ విషయంలో అలసత్వం వహించే వారిపై చర్యలకు ఏ మాత్రం వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు గ్రామ సచివాలయాలు సందర్శించాలని సీఎం జగన్ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి ఆయన డిసెంబర్ నుంచి మళ్లీ జిల్లా పర్యటనలు మొదలుపెట్టబోతున్నట్టు అర్థమవుతోంది. వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిశోర్ టీమ్ రంగంలోకి దిగుతుందని కొద్దిరోజుల క్రితమే మంత్రులకు చెప్పిన సీఎం జగన్.. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సిద్ధం కావాలని సూచించారు.
పీకే టీమ్ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేస్తుందని సీఎం జగన్ మంత్రులకు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్రామ సచివాలయాల పరిశీలించే క్రమంలోనే సీఎం జగన్ జిల్లాలను చుట్టేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఓ వైపు పీకే టీమ్ రంగంలోకి దిగుతుండటం.. అంతకంటే ముందే సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం వెనుక అసలు వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.