శాసనమండలి రద్దు.. సీఎం జగన్ అసలు వ్యూహం ఇదే..?

దాదాపు మండలి రద్దు అయిపోతుందనే భావన కల్పించడంలో సక్సెస్ అయిన ప్రభుత్వం.. మండలిలో ఉన్న 58 మంది ఎమ్మెల్సీలను ఆత్మరక్షణలో పడేసింది. ఇందులో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపి ఒక్కసారిగా అమరావతిలో హీరోగా మారిపోయిన ఛైర్మన్ షరీఫ్ కూడా ఉన్నారు.


Updated: January 23, 2020, 9:43 PM IST
శాసనమండలి రద్దు.. సీఎం జగన్ అసలు వ్యూహం ఇదే..?
వైఎస్ జగన్
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ ప్రతినిధి)

ఏపీలో రాజధాని వికేంద్రీకరణతో పాటు పలు కీలక బిల్లుల ఆమోదంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేస్తుందన్న కారణంతో శాసన మండలి రద్దుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇవాళ్టి పరిణామాలు కనిపించాయి. కానీ ఇదంతా నిజమేనా అంటే కాకపోవచ్చనే సమాధానం వస్తోంది. దీనికి కారణం.. మంత్రులు, సీఎం సహా పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సైతం మండలి అవసరమా అనే ప్రశ్నను పదేపదే సంధించారు. కానీ సమయం ఉన్నా దీనిపై ఎలాంటి బిల్లు కానీ, తీర్మానం కానీ చేయకుండానే అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేసేశారు. దీనివెనుక భారీ వ్యూహమే దాగున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును శాసనసభ ఆమోదించి పంపినా మండలిలో మాత్రం ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్దితి ఎదురైందని అనుకుంటున్న వేళ సీఎం జగన్ దీనిపై విపక్షాలకు భారీ కౌంటర్ ఇస్తూ మండలి రద్దును తెరపైకి తెచ్చారు. మంత్రులతో పాటు తాను కూడా ఇవాళ శాసనసభ వేదికగా మండలి అవసరం ఉందా అనే వాదనను పదే పదే వినిపించారు. చరిత్రలో వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ మండళ్ల ఏర్పాటు, రద్దు, వాటికి దారి తీసిన పరిణామాలు, రాజ్యాంగ నిబంధనలు, మండలి నిర్ణయాల కారణంగా ప్రజాభిప్రాయం అపహాస్యం అవుతున్న తీరుపై పలువురు సభ్యులు కూలంకషంగా చర్చించారు. దాదాపు మూడు గంటల చర్చ తర్వాత సభలో ప్రసంగించిన సీఎం జగన్ కూడా మండలి అవసరం లేదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించని మండళ్ల ద్వారా భారీ వ్యయ ప్రయాసలతో పాటు ఎన్నో అనర్ధాలున్నాయని స్పష్టం చేశారు.

సీఎం జగన్ ప్రసంగం తర్వాత శాసనసభ మండలిని రద్దు చేస్తూ బిల్లును తీసుకొస్తుందని లేదా దానికి మద్దతుగా తీర్మానం కానీ చేస్తుందని అంతా భావించారు. కానీ అందరి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ సీఎం జగన్ కానీ మంత్రులు కానీ సభ దీనిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పి ముగించారు. చివర్లో ఈ చర్చపై స్పందించిన స్పీకర్ సైతం మండలి విషయంలో ప్రభుత్వం ఆలోచించి తగు నిర్ణయం తీసుకుటుందని చెప్పి సోమవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు. అయితే తగినంత సమయం ఉండి కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సభను ముగించడం, రిపబ్లిక్ డే ఏర్పాట్ల నేపథ్యంలో మూడు రోజుల పాటు సభకు విరామం ప్రకటించడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది.దాదాపు మండలి రద్దు అయిపోతుందనే భావన కల్పించడంలో సక్సెస్ అయిన ప్రభుత్వం.. మండలిలో ఉన్న 58 మంది ఎమ్మెల్సీలను ఆత్మరక్షణలో పడేసింది. ఇందులో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపి ఒక్కసారిగా అమరావతిలో హీరోగా మారిపోయిన ఛైర్మన్ షరీఫ్ కూడా ఉన్నారు. దీంతో వీరిలో మండలిలో రూల్ 71పై చర్చ సందర్భంగా వైసీపీకి అనుకూలంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు శివనాథ్ రెడ్డి, పోతుల సునీత సాయంత్రమే సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు మరికొందరు ఎమ్మెల్సీలను దారిలోకి తెచ్చుకోవాలనేది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో మండలి రద్దు నిర్ణయంతో పదవులు కోల్పోతామని భయపడుతున్న ఎమ్మెల్సీలను దారికి తీసుకొచ్చి ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో ఎలాంటి సానుకూల ఫలితాలు రాబట్టలేకపోతే మాత్రం ప్రభుత్వం మండలి రద్దుకు మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. సాధ్యమైనంత ఎక్కువమంది ఎమ్మెల్సీలను తనవైపు తిప్పుకోగలిగితే మాత్రం మండలి రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసుకోవచ్చని తెలుస్తోంది.
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు