Tirupati By Polls: తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరు ? జగన్ మదిలో కొత్త పేరు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం (File)

Tirupati By Polls: ఎంపీ టికెట్‌ దుర్గా ప్రసాద్ కుమారుడు కల్యాణ్‌కు ఇవ్వలేకపోతే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే యోచనలో ఉన్న సీఎం జగన్.. ఈ మేరకు వారికి హామీ ఇచ్చే అవకావం ఉందని తెలుస్తోంది.

 • Share this:
  తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణం కారణంగా జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తిని వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తున్నట్టు వచ్చాయి. అయితే తాజాగా మరో కొత్త పేరు కూడా అధికార పార్టీ నుంచి తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. తన పాదయాత్ర సమయంలో తన వెంట నడిచిన ఫిజియోథెరపిస్ట్‌ గురుమూర్తికి ఎంపీ సీటు ఇవ్వాలనే అంశాన్ని కూడా సీఎం జగన్ పరిశీలిస్తున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది. ముందుగా దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులను పిలిచి ఈ విషయాన్ని చెప్పాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

  ఎంపీ టికెట్‌ కల్యాణ్‌కు ఇవ్వలేకపోతే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే యోచనలో ఉన్న సీఎం జగన్.. ఈ మేరకు వారికి హామీ ఇచ్చే అవకావం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ అంశంపై సీఎం జగన్ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, పి.అనిల్‌కుమార్‌, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రఽభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు.

  2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున బల్లి దుర్గా ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మీద 2.28 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చనిపోయారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1994, 1999, 2009లో నాలుగుసార్లు గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఇ

  మరోవైపు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ తరఫున బరిలో నిలపనున్నట్టు ఆ పార్టీ నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉప ఎన్నికలో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యుహంపై ప్రధానంగా చర్చించారు. పనబాక లక్ష్మి గెలుపు కోసం అందరు కలిసి పనిచేయాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. పనబాక లక్ష్మి గతంలో నెల్లూరు నుంచి రెండు సార్లు, బాపట్ల నుంచి ఒక సారి ఆమె 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి గా పనిచేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ,జౌళి తదితర మంత్రిత్వ శాఖలను ఆమె నిర్వర్తించారు. ఇలా కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన పనబాక లక్ష్మి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో టీడీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

  మరోవైపు బీజేపీ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. గతంలో తిరుపతి నుంచి ఓ సారి బీజేపీ గెలుపొందింది. అలాగే, ఇటీవల తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో అదే ఉత్సాహాన్ని తిరుపతిలో కూడా కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: