ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలలుగా ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నా సాధ్యం కాలేదు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం, ఇతరత్రా కారణాలతో జగన్ కు అపాయింట్ మెంట్ వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ పెద్దలు ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో హడావిడిగా అపాయింట్ మెంట్ ఖరారు చేయడం, జగన్ కూడా వెంటనే సిద్ధం కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఈ మధ్య జాతీయ స్దాయిలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలతో కుదేలవుతున్న బీజేపీ పెద్దలు.. దక్షిణాదిన కీలకంగా ఉన్న వైసీపీ, డీఎంకే వంటి పార్టీలను కేబినెట్లోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాతే వైసీపీకి కేబినెట్ లో చేరాలని ఆహ్వానం అందింది. అయితే వైసీపీ మాత్రం ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు కోసం పోరాడుతున్న తరుణంలో కేబినెట్ లో చేరితే వాటిపై రాజీ పడాల్సి వస్తుందన్న కారణంతో బీజేపీ ప్రతిపాదనకు అంగీకరించలేదు. అప్పట్లో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం ఎన్డీయే పెద్దలు వైసీపీకి ఆఫర్ చేశారు. అయినా జగన్ మాత్రం ఎన్డీయేలో చేరేందుకు అంగీకరించకుండా ఆ ప్రతిపాదనను వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో ఓటమి తర్వాత బీజేపీ అధిష్టానం కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఢిల్లీ ఓటమిని మరిపిస్తూ కేబినెట్ లోకి దక్షిణాది పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా తాము బలంగానే ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దక్షిణాదిన బలంగా ఉన్న వైసీపీ, డీఎంకే పార్టీలను కేబినెట్ లోకి మరోమారు ఆహ్వానించన్నట్లు సమాచారం.
కేంద్ర కేబినెట్ లో చేరేందుకు వైసీపీ అంగీకరిస్తే ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయనతో పాటు వైసీపీకి చెందిన మరో దళిత ఎంపీకి కూడా అవకాశం దక్కనుంది. అలాగే డీఎంకే నుంచి పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళికి అవకాశం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కనిమొళితో పాటు మరో డీఎంకే ఎంపీకి సహాయమంత్రి పదవిని ఆఫర్ చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో డీఎంకే అధినేత స్టాలిన్ ఈ ప్తతిపాదనను ఏ మేరకు అంగీకరిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ మాత్రం ఈసారి ప్రధాని కేబినెట్ పదవుల ప్రతిపాదన చేస్తే అంగీకరించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
(సయ్యద్ అహ్మద్, న్యూస్18 ప్రతినిధి, అమరావతి)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Bjp, Pm modi, Vijayasai reddy, Ysrcp