ఏపీలో నేడు జరగాల్సిన కేబినెట్ భేటీ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ భేటీని... నేడు జరపాలని భావించిన జగన్ సర్కార్... ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. అయితే హఠాత్తుగా నేటి కేబినెట్ భేటీ వాయిదా వేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. సోమవారం రోజునే ఈ భేటీ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడటానికి కారణమేంటనే దానిపై అసక్తికరమైన చర్చ జరుగుతోంది. కీలకమైన రాజధాని తరలింపు అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రిని కలిసి వివరించాలని ఏపీ సీఎం జగన్ భావించారనే చర్చ సాగుతోంది.
అయితే ఏపీ సీఎం జగన్కు వారిద్దరి అపాయింట్మెంట్ ఖరారు కాలేదని... ఈ కారణంగానే ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా పడుతూ వస్తోందని సమాచారం. రాబోయే రెండు రోజుల్లో ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లి వారికి రాజధాని తరలింపు అంశంపై వివరణ ఇవ్వాలని భావిస్తున్న సీఎం జగన్... ఆ తరువాతే దీనిపై కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఈ మొత్తం ప్రక్రియకు కేంద్రం నుంచి కూడా పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని ఆయన భావిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నేడు సీఎం జగన్కు మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ దాదాపుగా ఓకే అవుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.