జగన్ నిర్ణయం... వైసీపీకి ప్లస్సా ? మైనస్సా ?

ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా... దానికి పార్లమెంట్ ఎప్పటికి ఆమోదముద్ర వేస్తుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు.

news18-telugu
Updated: January 26, 2020, 3:55 PM IST
జగన్ నిర్ణయం... వైసీపీకి ప్లస్సా ? మైనస్సా ?
సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించడంపై ఆగ్రహంగా ఉన్న ఏపీ సీఎం జగన్... అసలు శాసనమండలి రాష్ట్రానికి అవసరమా ? అని ప్రకటన చేశారు. రేపు ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దుకు సంబంధించి జగన్ సర్కార్ తీర్మానం చేయనుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ వర్గాలు, వైసీపీ ముఖ్యనేతలు సైతం సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేయడానికే నిర్ణయించుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే శాసనమండలి రద్దు నిర్ణయం కారణంగా వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం లభించే అవకాశం ఉంటుందా ? లేదా ? అన్న అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా... దానికి పార్లమెంట్ ఎప్పటికి ఆమోదముద్ర వేస్తుందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. గతంలో శాసనమండలి రద్దు, పునరుద్ధరణ కోసం రెండేళ్ల వరకు సమయం పట్టడంతో... ఈసారి కూడా దాదాపు అంతే సమయం పట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. జగన్ భావిస్తున్నట్టుగా శాసనమండలి సాధ్యమైనంత తొందరగా రద్దయితే పర్వాలేదు కానీ... మండలిలో టీడీపీ ప్రాతినిథ్యం తగ్గి వైసీపీ మెజార్టీ పెరిగే సమయంలో మండలి రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఎలా అని పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే సమీప భవిష్యత్తులో తమకు మండలిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం వైపు మొగ్గుచూపారనే ప్రచారం కూడా సాగుతోంది. ఏదేమైనా... శాసనమండలి రద్దుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దీనిపై కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తుంది, తొందరగా దీన్ని పార్లమెంట్‌లో ఆమోదిస్తుందా అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే.First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు