CM KCR WRITES LETTER TO PM MODI OVER FERTILIZER PRICES TRS CHIEF SLAMS BJP OVER FARMERS ISSUES MKS
cm kcr : లక్షల నాగళ్లతో modiపై తిరుగుబాటు.. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిద్దామంటూ..
పీఎం మోదీతో సీఎం కేసీఆర్(పాత ఫొటో)
లక్షలాది నాగళ్లతో రైతులంతా మోదీపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని, బీజేపీని కూకటివేళ్లతో పెకిలించాలంటూ దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎరువుల ధరలు పెంచడం ద్వారా బీజేపీ రైతు వ్యతిరేకి అని మరోసారి నిర్ధారణ అయిందన్నారు. ఈ అంశంలో ప్రధాని మోదీకి ఘాటు లేఖను సిద్ధం చేశారు సీఎం కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR) మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. లక్షలాది నాగళ్లతో రైతులంతా మోదీపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని, బీజేపీని కూకటివేళ్లతో పెకిలించాలంటూ దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతాంగం, వ్యవసాయం దుస్థితి ఎదుర్కొంటున్న సమయంలోనే కేంద్రం ఎరువుల ధరలు పెంచిందని మండిపడ్డ ఆయన.. కేంద్రానికి తన నిరసనను తెలియజేయడంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాని మోదీకి లేఖ రాయనున్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలివే..
రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం ఉల్టా వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. బీజేపీ పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి నిర్ధారణ అయిందని, దేశ రైతాంగాన్ని బీజేపీ బతకనిచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు.
కరెంటు మోటార్లు బిగించి బిల్లులు వసూలు చేయడం, రాజేంద్రనగర్ ఎన్జీ రంగా వర్సిటీ అనుసంధానానికి నిరాకరించడం, విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు పూనుకోవడం.. ఇలా బీజేపీ అనుసరిస్తోన్న ప్రతి ఎత్తుగడ వెనుకా కుట్ర దాగి వుందని సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చేసే బీజేపీ కుట్రలను ఎదుర్కోవాలన్నారు.
గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, అనుబంధ వృత్తులను నిర్వీర్యం చేసి, గ్రామీణ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ పార్టీ ని కూకటివేళ్లతో పెకలించి వేయాలని తెలంగాణ సహా దేశ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తివేసి రైతులను వ్యవసాయం చేయకుండా చేస్తున్న మోదీ సర్కారుపై దేశ రైతాంగం నాగళ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయ రంగాన్నికాపాడుకోలేని పరిస్థితి దాపురించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎరువుల ధరలు, రైతుల సమస్యల అంశాల్లో బీజేపీ కేంద్ర సర్కారుకు బుద్ధి వచ్చేదాకా ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకొని బీజేపీ ప్రభుత్వం పై ధరలు తగ్గించే దాకా సాగే పోరాటంలో కలిసిరావాలని కేసీఆర్ కోరారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.