CM KCR WILL OFFER MLC POST IN GOVERNOR QUOTA TO EX SPEAKER MADHUSUDHANA CHARY AK
గవర్నర్ కోటాలో ఆ నేతకు ఎమ్మెల్సీ ఛాన్స్.. సీఎం కేసీఆర్ నిర్ణయం ?
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని భావించిన మాజీ స్పీకర్, సీనియర్ రాజకీయ నేత మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ కోటాలో ఎంపిక చేయాల్సిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ కోటాలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించింది తెలంగాణ కేబినెట్. అయితే కేబినెట్ పంపించిన ఈ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపలేదు. ఈ అంశాన్ని ఆమె పెండింగ్లో పెట్టారు. దీంతో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఉంటుందా ? లేదా అన్న అంశంపై చర్చ జరిగింది. అయితే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి శాసనమండలికి పంపాలని సీఎం కేసీఆర్ డిసైడయ్యారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డి నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. దీంతో సీఎం కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని భావించిన మాజీ స్పీకర్, సీనియర్ రాజకీయ నేత మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఇందుకు సంబంధించిన ఫైలును గవర్నర్కు పంపబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి మధుసూదనాచారిని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని భావించారు. కానీ.. కౌశిక్ రెడ్డికి ఈ కోటాలో ఛాన్స్ ఇచ్చి.. మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎంపిక చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కూడా పూర్తయితే... స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసే వారి ఎంపికపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి స్థానాలు 12 వరకు ఉండటంతో.. వారిలో ఎంతమందికి మళ్లీ తిరిగి పోటీ చేసే అవకాశం లభిస్తుందో అనే అంశం ఆసక్తికరంగా మారింది.
వీరిలో కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వారికి ఈసారి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉండదని సీఎం కేసీఆర్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అలాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఇప్పుడు కళ్ల ముందున్న ఎమ్మెల్సీ సీటును ఎంతమంది వదులుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.