Home /News /politics /

CM KCR TO MEET 412 DALITH PEOPLE IN PRAGATHI BHAWAN ON JULY 26TH GOVT ARRANGES SPECIAL BUSES FROM HUZURABAD SK

CM KCR: జులై 26న హుజూరాబాద్ వాసులతో సీఎం కేసీఆర్ భేటీ.. ప్రగతి భవన్‌కు ప్రత్యేక బస్సులు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు కలిపి నలుగురికి ఆహ్వానం అందింది. అలాగే ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున సీఎంతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మొత్తంగా 412 మంది దళిత పురుషులు, మహిళలు సదస్సుకు హాజరవుతారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలు, దళిత బంధు పథకం గురించే హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఉపఎన్నికల జరుగుతున్న హుజూరాబాద్ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఐతే దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. పథకాల పేరిట లీగల్‌గా ఓట్లను కొనే కార్యక్రమం చేపడుతున్నారని విరుచుకుపడుతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పథకం అమలుకు అంతా సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో జులై 26న దళిత బంధుపై ప్రగతి భవన్‌లో అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై హుజూరాబాద్‌కు చెందిన దళిత సామాజికవర్గం ప్రజలకు సీఎం కేసీఆర్ అవగాహన కల్పించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్ నుంచి 412 మంది దళితులు హాజరవుతారు.

    హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు కలిపి నలుగురికి ఆహ్వానం అందింది. అలాగే ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున సీఎంతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మొత్తంగా 412 మంది దళిత పురుషులు, మహిళలు సదస్సుకు హాజరవుతారు. వారితో పాటు 15 మంది రిసోర్స్‌ పర్సన్స్‌ కూడా సమావేశానికి హాజరవుతారు. దళిత బంధు అవగాహన సదస్సుకు హాజరయ్యే వారంతా జులై 26న ఉదయం 7 గంటల్లోపు తమ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత ప్రత్యేక బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి వెళ్తారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై వారికి సీఎం కేసీఆర్ స్వయంగా అవగాహన కల్పిస్తారు.


    దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకుంటారు. ఆ తర్వాత నిబంధనలను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందులో హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.

    రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని సీఎం కేసీఆర్ ఇటీవల తెలిపారు. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందని చెప్పారు. అందుకోసం అధనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో ఖర్చు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని పూర్తి స్థాయి వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు. అంతా సిద్ధమయ్యాక సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించి పథకాన్ని ప్రారంభిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Dalitha Bandhu, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు