అంతా మాంద్యం ప్రభావమే... సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేశారా ?

కేంద్రం నిర్ణయాల కారణంగానే ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులు తలెత్తాయని సీఎం కేసీఆర్ చెప్పకపోయినప్పటికీ... బడ్జెట్ ప్రసంగంలో పదే పదే ఆర్థిక మందగమనం ఉందని ఆయన ప్రస్తావించడం బీజేపీని టార్గెట్ చేయడమే అనే చర్చ జరుగుతోంది

news18-telugu
Updated: September 9, 2019, 12:59 PM IST
అంతా మాంద్యం ప్రభావమే... సీఎం కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేశారా ?
నరేంద్ర మోదీ, కేసీఆర్ (File)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో కేంద్రాన్ని పరోక్షంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్‌లో బడ్జెట్ అంచనాలకు 20 శాతానికిపైగా తగ్గిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం... జాతీయ స్థాయిలో వృద్దిరేటు తగ్గిన తీరు, ఆర్థిక మాంద్యం గురించి ఎక్కువగా ప్రస్తావించడం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించినట్లుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు ప్రస్తావించారు. వాహనాల మార్కెట్ దెబ్బతిన్నదని, దాంతో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని నిలుపుదల చేశాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఫలితంగా వాహనాల రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని, వేలాది మంది ఆయా రంగాలలో ఉపాధి కోల్పోయారని కెసీఆర్ వెల్లడించారు. బొగ్గు గనులలో కూడా ఉత్పత్తి తగ్గించవలసి వచ్చిందని ఆయన అన్నారు. ఇదంతా జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాలని, ఈ ఆర్దిక మాంద్యం ప్రభావం తెలంగాణపై కూడా పడిందని కెసిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ఆదాయంలో వృద్ది రేటు బాగా తగ్గిందని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా పదిహేను శాతం ఆదాయం పెరుగుతుందని అనుకుంటే... ఐదు శాతం మాత్రమే పెరిగిందని ఆయన అన్నారు. గత ఆర్దిక సంవత్సరం పన్నులలో వృద్ది 13 శాతం ఉంటే, ఈ ఏడాది 6 శాతం మాత్రమే ఉందని ఆయన అన్నారు. స్టాంప్, రిజిస్ట్రేషన్‌లలో నాలుగు శాతం వృద్ది రేటు ఆశించిన దాని కన్నా తగ్గిందని సీఎం కేసీఆర్ అన్నారు.

వాహనాల రిజిస్ట్రేషన్‌లో మైనస్ వృద్ది రేటు ఉందని సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పన్నేతర శాతం 29 శాతం తగ్గిందని, ఇదంతా ఆర్దిక మాంద్యం ప్రభావమనేనని ఆయన అన్నారు. కేంద్రం పన్నుల వాటాలో 4.5 శాతం కోత పెట్టిందని ఆయన అన్నారు. మరికొన్ని రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా ఉందని కెసీఆర్ చెప్పారు. వాటితో పోల్చితే తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్ల అని చెప్పాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కేంద్రం నిర్ణయాల కారణంగానే ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులు తలెత్తాయని సీఎం కేసీఆర్ చెప్పకపోయినప్పటికీ... పదే పదే ఆర్థిక మందగమనం ఉందని ఆయన ప్రస్తావించడం బీజేపీని టార్గెట్ చేయడమే అనే చర్చ జరుగుతోంది.
First published: September 9, 2019, 12:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading