కేబినెట్‌లో సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయం..

Telangana Cabinet | CM KCR | కేబినెట్ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం భారీగానే పడే అవకాశం ఉందని గ్రహించి.. అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై నియంత్రణ పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

news18-telugu
Updated: December 12, 2019, 8:37 AM IST
కేబినెట్‌లో సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయం..
సీఎం కేసీఆర్ (ఫైల్)
  • Share this:
కేబినెట్ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం భారీగానే పడే అవకాశం ఉందని గ్రహించి.. అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై నియంత్రణ పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నాడు ప్రగతి భవన్‌లో దాదాపు 5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని, రూ.3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే ఖర్చును రెండు సంవత్సరాల బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో, భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజి నిర్మాణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు వరకు 3వ టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.11,806 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఖర్చులను రెండేళ్ల బడ్జెట్లో కేటాయించాలని నిర్ణయించారు.

అటు.. గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత వెల్లివిరిసేలా, ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం-పల్లె ప్రగతి పురోగతిపై సమావేశంలో చర్చించారు. ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చిన ఈ కార్యక్రమం స్పూర్తిని కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి -కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిలు తదితర ఆర్థిక విషయాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. ఆర్థిక మాంద్యం కారణంగా రాష్ట్రంలో కూడా ఆదాయాలు పడిపోయాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో అన్ని శాఖలు కఠినమైన ఆర్థిక నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు. బడ్జెట్ కేటాయింపులకు మించి ఏ శాఖలోనూ ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయడానికి వీల్లేదని చెప్పారు. అన్ని శాఖలు విధిగా నియంత్రణ పాటించాల్సిందేనని, సరైన ఆర్థిక క్రమశిక్షణతోనే పరిస్థితిని ఎదుర్కోగలమని అన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 12, 2019, 6:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading