Telangana: అప్రమత్తమైన కేసీఆర్.. అసలు కారణం అదేనా.. రేపు ఏం చెప్పబోతున్నారు ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: విపక్షాల విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వకపోతే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది.

  • Share this:
    మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తరువాత సీఎం కేసీఆర్ మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే దళితబంధు పథకం మొదలుపెట్టిన సీఎం కేసీఆర్.. హుజూరాబాద్‌లోని దళితులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందనే అంశంపై క్లారిటీ లేదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ దూకుడు పెంచడంతో.. వారికి కౌంటర్ ఇచ్చే అంశంపై కూడా టీఆర్ఎస్ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచారు. ఇక టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి అండ్ టీమ్.. అధికార టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు టీఆర్ఎస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. అయితే ఈ విషయంలో విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే విషయంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ భేటీ జరగనుంది.

    దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషిపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారని సమాచారం. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఎలా ఉన్నా.. దళితబంధు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. దీనిపై విపక్షాల విమర్శలకు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలనే దానిపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు.

    ఇక కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు చేసే విమర్శలను పార్టీ నేతలు ఏ రకంగా ఎదుర్కోవాలి ? వారికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దానిపై సీఎం కేసీఆర్ నేతలకు సూచించబోతున్నారు. విపక్షాల విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వకపోతే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే నేతలెవరూ ఈ విషయంలో అలసత్వం వహించవద్దని.. పార్టీని పట్టించుకోకుండా ఉండకూడదనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన నేతలకు స్పష్టం చేయబోతున్నట్టు సమాచారం.
    Published by:Kishore Akkaladevi
    First published: