CM KCR SPECIAL LETTER TO FORMER ALLY AND BJP MLA ETELA RAJENDER WISHING BIRTHDAY WHILE TRS CHIEF GEARS UP WAR AGAINST CENTRE MKS
CM KCR | Etela Rajender: సీఎం కేసీఆర్ భారీ సర్ప్రైజ్.. ఈటల రాజేందర్‌కు లేఖ.. బీజేపీపై యుద్దం వేళ!
కేసీఆర్ తో ఈటల (పాత ఫొటో)
హుజూరాబాద్ ఫలితం తర్వాత ఏకంగా కేంద్రంపై యుద్ధమే ప్రకటించారు. ఆ పోరును తాజాగా మరోసారి ఉధృతం చేయడానికి సంకల్పించగా.. భారీ సర్ప్రైజ్ ఇచ్చారు ముఖ్యమంత్రివర్యులు..
బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తానని శపథం చేయడానికి.. కేంద్రంలోని మోదీ సర్కారును కూలగొడతానని తీర్మానించుకోడానికి.. కమలదళానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తాననడానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పురిగొల్పిన ప్రధానాంశం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఒకప్పటి కేసీఆర్ అనుంగుడు, టీఆర్ఎస్ లో నంబర్2గా వ్యవహరించిన ఈటల రాజేందర్ అనూహ్య పరిస్థితుల్లో బర్తరఫ్కు, ఆపై పార్టీ నుంచి వెలివేతకు గురై, బీజేపీ తరఫున హుజూరాబాద్ లో భారీ విజయం సాధించిన తర్వాత కమలదళంతో కేసీఆర్ ఈక్వేషన్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా తన విమర్శల్లో బీజేపీకి చోటివ్వని కేసీఆర్.. హుజూరాబాద్ ఫలితం తర్వాత ఏకంగా కేంద్రంపై యుద్ధమే ప్రకటించారు. ఆ పోరును తాజాగా మరోసారి ఉధృతం చేయడానికి సంకల్పించగా.. భారీ సర్ప్రైజ్ ఇచ్చారు ముఖ్యమంత్రివర్యులు..
ఇటీవలే ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారి సభలోకి అడుగుపెట్టినరోజే ఈటల రాజేందర్ సహా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించింది కేసీఆర్ సర్కారు. స్పీకర్ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లినా సానుకూలత రాలేదు. అసలు ఈటల ముఖం చూడటం ఇష్టంలేకే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించాడని కేంద్ర మంత్రులు ఆరోపించారు. ‘కేసీఆర్ ఒక్కసారి పగ పడితే అవతలివాడి అంతు చూసేదాకా నిద్రపోడు.. ఆగమాగం చేస్తాడు..’అని ఈటల గతంలో పలుమార్లు చేసిన విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. కానీ ఇవాళ మాత్రం సీఎం కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. నేరుగా ఈటలకే ప్రత్యేక లేఖ రాశారు.
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పలువురు నేతలు, సన్నిహితులు, అభిమానులు ఆయనను నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి వరుస విషెస్ తో తీరికలేకుండా గడుపుతోన్న ఈటలకు కొద్దిసేపటి కిందట ఓ ప్రత్యేక వ్యక్తి నుంచి శుభాకాంక్షలు అందాయి. ఆ వ్యక్తి మరెవరోకాదు.. సీఎం కేసీఆరే. ఈటల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ సీఎం కేసీఆర్ ఇవాళ లేఖ పంపారు.
తెలంగాణ రాజముద్ర, తెలంగాణ ముఖ్యమంత్రి అని ప్రముఖంగా ప్రచురించిన లేఖలో ‘శ్రీ ఈటల రాజేందర్ గారు.. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. కె.చంద్రశేఖర్ రావు’అని రాసుంది. దేవరయాంజల్ లోని ఈటల ఇంటి చిరునామాకు ఈ లేఖను రాశారు. బద్ద విరోధిగా భావించే ఈటలకు ఇంత సడెన్ గా సీఎం కేసీఆర్ విషెస్ చెప్పడమేంటనే చర్చ జరిగింది. కొన్ని రోజుల కిందట అసెంబ్లీలో కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్.. ఈటలను ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశం కావడం తెలిసిందే.
అయితే, ఈటలకు కేసీఆర్ లేఖ సాధారణ ప్రక్రియే అని, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేల పుట్టినరోజులకు సీఎం శుభాకాంక్షలు తెలపడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ అని వెల్లడైంది. గతేడాది(2021) మే నెలలో కేసీఆర్ నుంచి ఈటల దూరమైన తర్వాత వచ్చిన తొలి బర్త్ డే కావడం వల్లే కేసీఆర్ లేఖకు ప్రాధాన్యం ఏర్పడినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై మళ్లీ వరి పోరును ఉధృతం చేశారు. సోమవారం టీఆర్ఎస్ భవన్ వేదికగా జరిగే శాసనసభాపక్ష సమావేశానికి ఎమ్మెల్సీలతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించడం గమనార్హం. బీజేపీపై యుద్ధంలో రెండో దశ పోరు ప్రణాళికను కేసీఆర్ సోమవారం వెల్లడించే అవకాశాలున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.