ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడనే అంశంపై వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ప్రజలకు లబ్ది జరిగిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మాత్రమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోలేదని... మిగతా అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని వివరించారు.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని... త్వరలోనే అక్కడి ప్రభుత్వం కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతోందని కేసీఆర్ అన్నారు. ఈ అంశంపై ఏపీ సీఎం జగన్తో తాను మాట్లాడానని... తనకున్న సమాచారం మేరకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతోందని... ఏపీలో జిల్లాల సంఖ్య 25కు చేరే అవకాశం ఉందని కేసీఆర్ వివరించారు. తెలంగాణలో అవసరానికి మించి ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేశారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం కేసీఆర్... ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP new districts, CM KCR, Telangana