సర్కార్‌లో ఆ శాఖ నెం.1.. సిబ్బందిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు

ఇదే స్పూర్తిని కొనసాగించాలని సిఎం పిలుపునిచ్చారు.  గ్రామాల అభివృద్ధికి నెలకు రూ. 339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం స్పష్టం చేశారు.

news18-telugu
Updated: October 10, 2019, 5:08 PM IST
సర్కార్‌లో ఆ శాఖ నెం.1.. సిబ్బందిపై  సీఎం కేసీఆర్ ప్రశంసలు
సీఎం కేసీఆర్ (File)
  • Share this:
గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంచడం లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ (పల్లె ప్రగతి)  దిగ్విజయంగా అమలయిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని గ్రామాల్లో  పవర్ వీక్ నిర్వహించి, విద్యుత్ సంబంధిత సమస్యలు  పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అద్భుతంగా పనిచేసి, అన్ని శాఖల్లో కెల్లా నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.  కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్పిఓలు, ఎంపిఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు సిఎం అభినందనలు తెలిపారు.  ఇదే స్పూర్తిని కొనసాగించాలని సిఎం పిలుపునిచ్చారు.  గ్రామాల అభివృద్ధికి నెలకు రూ. 339 కోట్లు విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం స్పష్టం చేశారు.

ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్పీఓలు, ముఖ్య కార్యదర్శుల సమావేశం గురువారం ప్రగతి భవన్ లో జరిగింది. ప్రతీ జిల్లా కలెక్టర్ 30 రోజుల కార్యక్రమం అమలులో అనుభవాలను వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు సమిష్టి ప్రణాళిక, సమిష్టి కార్యాచరణ, సమిష్టి అభివృద్ధి అనే ఆశయాలతో కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్లు వెల్లడించారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పిసిసిఎఫ్ శోభ, డిస్కమ్ ల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని, మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన ప్రజల్లో వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ స్పూర్తిని కొనసాగించడానికి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

గ్రామాలు బాగుపడాలనే ఉద్దేశ్యంతో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేసినట్లు సిఎం వెల్లడించారు. గ్రామ పంచాయతీలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమని చెప్పారు. ప్రతీ నెలా గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయల ఆర్థిక సంఘ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదని,ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుందని సిఎం స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయానికి ఇది అదనమని సిఎం అన్నారు. చెట్లు పెంచే పనులకు, చెత్త ఎత్తేవేసే పనులకు నరేగా నిధుల వాడుకోవాలని సూచించారు.  అవసరమైన సిబ్బందిని ఇచ్చామని, అవసరమైన నిధులను విడుదల చేశామని, ఇప్పటికైనా గ్రామాల్లో మార్పు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారులు ప్రధాన బాధ్యత తీసుకుని, నిధులను సక్రమంగా వినియోగించుని,   గ్రామాల్లో మార్పు తీసుకురావాలని కోరారు. గ్రామ స్థాయిలో రూపొందించిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా పనులు జరగాలని చెప్పారు.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు