Home /News /politics /

CM KCR NEW STRATEGY TO TACKLE BJP IN NAGARJUNA SAGAR BY POLL AK

K Chandrashekar Rao: టార్గెట్ బీజేపీ.. కేసీఆర్ సరికొత్త వ్యూహం.. అప్పటివరకు ఇంతే..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: నాగార్జునసాగర్‌లో బీజేపీకి చెక్ చెప్పేందుకు సరికొత్త వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీని నిలువరించడమే ఇప్పుడు టీఆర్ఎస్ ముందున్న ప్రధాన లక్ష్యం. దుబ్బాక, జీహెచ్ఎంసీలో సత్తా చాటిన బీజేపీకి చెక్ చెప్పడం ఎలాగనే దానిపై సీఎం కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించాలని బీజేపీ యోచిస్తోంది. అందుకోసం గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటోంది. అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేసుకుంటోంది. అయితే నాగార్జునసాగర్‌లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. తెలంగాణలో ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్‌కు మరింత గట్టి పోటీ ఎదురవుతుందనే భావనలో ఉన్న సీఎం కేసీఆర్... ఎలాగైనా అక్కడ బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలనే యోచనలో ఉన్నారు.

    ఈ క్రమంలోనే ఆయన నాగార్జునసాగర్‌లో బీజేపీకి చెక్ చెప్పేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి బలమైన నేతగా ఉన్న మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. దీంతో టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు అవకాశం ఉంటుందా లేక కొత్త అభ్యర్థి రేసులో ఉంటారా ? అని కొద్దిరోజుల్లో తేలనుంది.

    అయితే అక్కడ బీజేపీ ప్రస్తావన ఎక్కువగా తీసుకురావద్దని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. అంతేకాదు అసలు నాగార్జునసాగర్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీపై పెద్దగా విమర్శలు చేయొద్దని కేసీఆర్ తమ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అలా చేయడం ద్వారా మనమే ఆ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని.. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఇలా జరగడం వల్లే బీజేపీకి ఎక్కువగా లాభం కలిగిందని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం.

    కేసీఆర్ ఆదేశాల కారణంగా తెలంగాణలోని మంత్రులు, ఇతర టీఆర్ఎస్ ముఖ్యనేతలు బీజేపీ నేతలపై విమర్శలు చేయడం లేదనే పలువురు చర్చించుకుంటున్నారు. బీజేపీ నేతలు ఎంతగా విమర్శలు చేసినా.. వారి విమర్శలు పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఇటీవల కొందరు మంత్రులు ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీకి రాజకీయంగా చెక్ చెప్పాలంటే.. ఆ పార్టీ విషయంలో మౌనంగా ఉండటమే మేలు అనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు అర్థమవుతోంది. మరి.. కేసీఆర్ సరికొత్త రాజకీయ వ్యూహం ఆ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Nagarjuna Sagar By-election, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు