హరీశ్ రావుకు మంత్రి పదవి... కేసీఆర్ క్లారిటీ ఇస్తారా ?

Harish Rao | మరికొద్ది రోజుల్లోనే తన సొంతూరు చింతమడకలో పర్యటించబోతున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

news18-telugu
Updated: July 9, 2019, 9:42 PM IST
హరీశ్ రావుకు మంత్రి పదవి... కేసీఆర్ క్లారిటీ ఇస్తారా ?
కేసీఆర్‌తో హరీశ్‌రావు (file)
  • Share this:
త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. మంచి రోజులు వచ్చిన వెంటనే కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణను చేపడతారని టీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఎప్పుడు మంత్రివర్గ చేపడతారనే ఆసక్తి ఓ వైపు... విస్తరణ చేపడితే అందులో మాజీమంత్రి హరీశ్ రావుకు చోటు ఉంటుందా అన్న సందేహాలు మరోవైపు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో హరీశ్ రావు, కేటీఆర్‌లను దూరం పెట్టిన కేసీఆర్... ఈ సారి వారిని కేబినెట్‌లోకి తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇందుకు సంబంధించిన ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా... దీనిపై కేసీఆర్ తన సొంతూరులోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తాజాగా చర్చ మొదలైంది. మరికొద్ది రోజుల్లోనే తన సొంతూరు చింతమడకలో పర్యటించబోతున్నారు కేసీఆర్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చింతమడక పర్యటన సందర్భంగా గ్రామంలో ఒక రోజు మొత్తం గడపనున్న కేసీఆర్... ఆ రోజు గ్రామంలో ఏం మాట్లాడతారనే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఆ రోజు కేసీఆర్ హరీశ్ రావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తే...ఆయనను మరోసారి కేబినెట్‌లోకి తీసుకోవడం ఖాయమని పలువురు చర్చించుకుంటున్నారు. అలా జరగని పక్షంలో కేసీఆర్ ఆలోచన మరో విధంగా ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి త్వరలోనే సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలోని తన సొంతూరుకు రానున్న కేసీఆర్... హరీశ్ రావు కేబినెట్ బెర్త్ విషయంలో క్లారిటీ ఇస్తారా లేదా అన్నది చూడాలి.First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు