Telangana: తెలంగాణ కేబినెట్‌లో మార్పులు.. త్వరలో ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు..?

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

‘దళితబంధు’ పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. ఈ పథకానికి చైర్మన్‌గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్‌ చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

 • Share this:
  హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. బీజేపీ తరపున ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తుండగా.. టీఆర్ఎస్ కూడా బుధవారమే అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న టీఆర్ఎస్‌వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు హుజూరాబాద్ టికెట్ ఇస్తున్నట్లు వెల్లడిచింది. ఇక ఇప్పటికే మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లో పర్యటిస్తూ.. ఈటల దూకుడు కళ్లెం వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే హుజూరాబాద్ ఎన్నికలకు ముందే తెలంగాణలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దళిత బంధు పథకం కేంద్రంగా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు.. మంత్రివర్గ విస్తరణ ద్వారా చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. ఈ క్రమంలోనే కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట.

  తెలంగాణ మంత్రివర్గంలో మొన్నటి వరకు సీఎం కేసీఆర్ సహా మొత్తం 17 మంత్రులు ఉన్నారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడం.. ఆయన బీజేపీలో చేరి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో 16 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌ మాత్రమే ఉన్నారు. ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చారని.. ఏడేళ్లుగా దళితులను మోసం చేస్తున్నారని, కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యత లేదని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజికవర్గం ప్రాతినిధ్యం పెంచాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

  ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ కేటగిరీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 18 మంది టీఆర్‌ఎస్‌ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో 8 మంది మాల, 9 మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని సామాజికవర్గానికి చెందినవారు. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిలో నుంచి కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని సమాచారం. ముఖ్యంగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వీరిలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి రావొచ్చని సమాచారం. హుజురాబాద్ ఉపఎన్నికల కంటే ముందే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది.

  అంతేకాదు ‘దళితబంధు’ పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. ఈ పథకానికి చైర్మన్‌గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్‌ చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మోత్కుపల్లి నర్సింహులు ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. దళిత బంధులాంటి పథకం తెచ్చిన కేసీఆర్.. అభినవ అంబేద్కర్ అంటూ ప్రశంసలు కురిపించారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. ఇది వ్యూహాత్మకంగానే వాయిదా పడిందని.. దళిత బంధు పథకం బాధ్యతలను ఆయనకు అప్పజెప్పుతారని సమాచారం. దళిత నేతలకు ఇలా పెద్ద పీట వేస్తూ విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవలి కాలంలో కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. తీన్మార్ మల్లన్న, వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్, ఈటల రాజేందర్ వంటి నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నిర్ణయాలతో వారిందరికీ చెక్ పెట్టాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

  ఇవి కూడా చదవండి:

  Rains In Telangana: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

  Huzurabad: హుజూరాబాద్‌లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అందుకే గెల్లు శ్రీనివాస్
  Published by:Shiva Kumar Addula
  First published: