ఆర్టీసీ సమ్మె... మారిన కేసీఆర్ వ్యూహం... తెరపైకి సీనియర్ నేత ?

ఆర్టీసీ సమ్మెను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త వ్యూహాన్ని రచించారనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: October 14, 2019, 1:44 PM IST
ఆర్టీసీ సమ్మె... మారిన కేసీఆర్ వ్యూహం... తెరపైకి సీనియర్ నేత ?
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పదో రోజుకు చేరుకుంది. సమ్మెపై అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మెట్టుదిగని పరిస్థితి నెలకొనడంతో... ప్రజల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. సమ్మెపై చర్చలు జరిగితే... సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే అశలు ఉండేవి. అయితే ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు చర్చల జోలికి వెళ్లకపోవడంతో... సమ్మె ఎప్పటికి ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. అసలు కార్మికులు, ప్రభుత్వం చర్చలకు రావాలన్నా భేషజాలు అడ్డువచ్చే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, కార్మికుల మధ్య చర్చల కోసం సీఎం కేసీఆర్ సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను బుజ్జగించేలా టీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు పత్రికా ప్రకటన విడుదల చేయడం... సమ్మె ఆపి చర్చలకు రావాలని ఆయన కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకే ప్రకటనలో చర్చల అంశం ఉండటంతో... సీఎం కేసీఆరే స్వయంగా కేకేను రంగంలోకి దింపారనే ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కీలక వ్యక్తిగా కేశవరావు అంటే కార్మిక సంఘాల నాయకులకు కూడా గౌరవమే. ఈ విషయాన్ని ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్ధామ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇరుపక్షాల డిమాండ్లు ఎలా ఉన్నా... ఒకసారి కేకే రంగంలోకి దిగి కార్మికులతో చర్చలు జరిపితే... పరిస్థితి ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేకే రంగంలో దిగి పరిస్థితిని చక్కబెడతారా ? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు