TSRTC | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ 26 వరాలు...

ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలు ఈనెల 2వ తేదీన ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించారు.

news18-telugu
Updated: December 1, 2019, 5:29 PM IST
TSRTC | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ 26 వరాలు...
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ భారీ వరం ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలు ఈనెల 2వ తేదీన ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించారు. సమ్మె కాలానికి (52 రోజులు) సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని కార్మికులకు హామీ ఇచ్చినట్టు తెలిసిందిి. తెలంగాణలోని ఆర్టీసీలో ఒక్కో డిపో నుంచి ఆరుగురు ప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె, మళ్లీ సంస్థను గాడిన పెట్టే అంశాలపై మాట్లాడారు. కార్మికుల సమస్యల గురించి తెలుసుకున్నారు. ఉద్యోగులు సమ్మెల పేరుతో సమస్యలను సృష్టించకుండా బాగా పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళితే సింగరేణి తరహాలో ప్రతి సంవత్సరం బోనస్ కూడా ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు.

ఆర్టీసీ కార్మికులతో కలిసి మద్యాహ్న భోజనం చేసిన కేసీఆర్, తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతీ అంశంపైనా, ప్రతీ సమస్యపైనా సిఎం స్పందించారు. అప్పటికప్పుడు పరిష్కరించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

1. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి.
2. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం.
3. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం
4. ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం5. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.
6. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
7. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.
8. ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుంది.
9. సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము.
10. కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
11. మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి
12. ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి
13. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం.
14. మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.
15. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.
16. రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు
17. ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం
18. ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి
19. ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు
20. ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి
21. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
22. ఉద్యోగుల పిఎఫ్ బకాయిలను, సిసిఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం
23. డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం
24. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం
25. ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది.
26. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 1, 2019, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading