CM KCR: దేవుడితోనైనా కొట్లాడతాం.. ఏపీపై తగ్గేది లేదన్న కేసీఆర్!

CM KCR: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై ఈనెల (అక్టోబర్) 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గురువారం ఈ మేరకు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

news18-telugu
Updated: October 1, 2020, 8:08 PM IST
CM KCR: దేవుడితోనైనా కొట్లాడతాం.. ఏపీపై తగ్గేది లేదన్న కేసీఆర్!
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకునే విషయంలో.. దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై ఈనెల (అక్టోబర్) 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఈ మేరకు అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అబ్రహం, సురేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్.కే.జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్ రావు, బీ. నాగేందర్ రావు, హరిరాం, సీఈలు నర్సింహ, శంకర్, రమేశ్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే వివాదానికి దిగుతోందని అనేక సార్లు సీఎం కేసీఆర్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలని అధికారులకు సూచింన్నారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలన్నారు. నిజానిజాలను ఈ సమావేశం సందర్భంగా యావత్ దేశానికి తేటతెల్లం చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు.

గతంలోనూ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఇరు రాష్ట్రాల రైతులకు ప్రయోజనాలు చేకూరేలా తాను స్నేహ హస్తం అందించానన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కావాలని కయ్యం పెట్టుకుంటున్నదని మండిపడ్డారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోందని కేసీఆర్ గతంలో సంచలన వాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Published by: Nikhil Kumar S
First published: October 1, 2020, 8:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading