బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీపై రాజకీయ యుద్ధం ప్రకటించిన తర్వాత తొలిసారి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మూడు రోజులు హస్తినలోనే మకాం వేసిన కేసీఆర్.. మంగళవారం ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్‌తో భేటీ అవుతారని ప్రచారం జరిగినా, ఆ సమావేశం చోటుచేసుకోలేదు. కేజ్రీవాల్ తో మీటింగ్‌లో.. విపక్ష సీఎంల సదస్సు వేదికపై చర్చలు జరుపుతారని వార్తలు వచ్చినా, అసలు కేజ్రీవాల్ ఢిల్లీలోనే లేరని వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వ్యూహం బెడిసి కొట్టిందా? అనే కొత్త చర్చ మొదలైంది. కానీ కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉద్దేశం వేరే అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి..
ఢిల్లీ కోటలు బద్దలు కొడుతానని, దేశంలో అగ్గిరాజేస్తానని హైదరాబాద్ వేదికగా ప్రకటనలు చేసి, ఆ వెంటనే చేపట్టిన ఢిల్లీ పర్యటనల్లో కేసీఆర్ కామ్‌గా వెనక్కి తిరిగొచ్చిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. అయితే, తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి కచ్చితంగా ఏదో ఒక పరిణామం జరుగుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు కూడా పాతసీనే రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై గులాబీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం కేజ్రీవాల్ తో సమావేశం ఉంటుందని వార్తలు వచ్చినా అది నిజం కాదంటున్నారు టీఆర్ఎస్ నేతలు.
కేసీఆర్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యేనాటికే కేజ్రీవాల్ సిటీలో లేరు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు కేసీఆర్ ఢిల్లీ వచ్చిన మాట నిజం కాదని.. తనతో పాటు సతీమణి వైద్య చికిత్సల కోసమే వచ్చారని టీఆర్ఎస్ పార్టీ నేత ఒకరు చెప్పినట్లు ‘ఆంధ్రజ్యోతి’ పేర్కొంది. కేజ్రీవాల్ బెంగళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స తీసుకుని మరో వారం తర్వాత తిరిగి వస్తారట. ఈ విషయం తమకు తెలుసునని గులాబీ నేతలు చెప్పారట. రాజకీయ భేటీలు లేకపోతే మరి కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నట్లని ఆరా తీస్తే..
కేసీఆర్ మంగళవారం నిజాముద్దీన్ సమీపంలో ఉన్న దంత వైద్యుడి వద్దకు వెళ్లారని వెల్లడైంది. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తీరుతెన్నులపై వివిధ వర్గాలతో కేసీఆర్ సమీక్షించినట్లు తెలిసింది. కేసీఆర్ ఢిల్లీకి రాగానే పలు ఉత్తరాది నేతలు, పాత్రికేయులతో చర్చలు జరిపారని సమాచారం. కేసీఆర్ సతీమణి శోభ బుధవారం ఎయిమ్స్‌లో పరీక్షలకు వెళతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బుధవారమే కేసిఆర్ హైదరాబాద్ తిరిగి వెళ్లే అవకాశాలు లేకపోలేదని తెలిసింది. తద్వారా ఈసారి కూడా గులాబీ బాస్ ఢిల్లీ పర్యటన సంచలనాలేవీ లేకుండానే ముగియడం ఖాయంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, CM KCR, Delhi, Trs