తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి బీజేపీతో అమీతుమీకి రెడీ అవుతున్నారా ? పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో బీజేపీ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం, లౌకికవాద శక్తుల్లో, ముఖ్యంగా యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో వారితో పాటుగా ఉద్యమించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే జనవరి 30వ తేదీన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
ఎన్నికలకు ముందు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ నిర్మిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత వెలువడిన లోక్సభ ఫలితాల్లో బీజేపీ భారీ విజయాలు సాధించడంతో సానుకూల వాతావరణం లేదని గ్రహించి సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీ తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఆర్ఎస్ఎస్ ద్వారా పావులు కదుపుతుండటంపై సీఎం కేసీఆర్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తాను జరిపే పోరాటంతో లౌకిక వాదులు, మైనార్టీలు వచ్చే ఎన్నికల్లో తనకు గట్టి అండగా నిలబడతారని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.
సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ, బెంగాల్, బిహార్, ఏపీలు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలోనూ ఆ చట్టాన్ని నిలువరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిపైనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ను కలిశారు. మహబూబ్నగర్లో ఈ అంశంపై సభ పెట్టిన అసదుద్దీన్... 27న నిజామాబాద్లో మరో సభ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ సభకు వచ్చే స్పందనను బట్టి హైదరాబాద్లో భారీ సభను కేసీఆర్ ఏర్పాటు చేస్తారని సమాచారం.
Published by:Kishore Akkaladevi
First published:December 26, 2019, 11:10 IST