Home /News /politics /

CM KCR CHIEF PRO JWALA NARASIMHA RAO SENSATIONAL COMMENTS ON TSRTC STRIKE BS

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సీపీఆర్వో ప్రత్యేక కథనం.. రాజుకున్న వివాదం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీఎం కేసీఆర్‌కు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జ్వాలా నరసింహారావు మాత్రం కార్మికులపై విషం కక్కేలా పలు వ్యాఖ్యలు చేశారట. అసలు సమ్మె అనేది అసంబద్ధమని, బాధ్యతా రాహిత్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయంలో కార్మికులను రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారని పలువురు అంటున్నారు.

ఇంకా చదవండి ...
  ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. వారికి కొన్ని వర్గాల నుంచి ఇప్పటికే మద్దతు లభిస్తోంది. కానీ, సాక్షాత్తు సీఎం కేసీఆర్‌కు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జ్వాలా నరసింహారావు మాత్రం ఆర్టీసీ సమ్మెపై కార్మకులదే తప్పు అని అభిప్రాయపడ్డారు. అసలు సమ్మె అనేది అసంబద్ధమని, బాధ్యతా రాహిత్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయంలో కార్మికులను రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారని పలువురు అంటున్నారు. ఆర్టీసీ విలీనం అనేది విధానపరమైన నిర్ణయం అని.. దానికోసం సమ్మె చేయడం అసంబద్ధమని నరసింహారావు తెలిపారు. చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి డిమాండ్లు అర్ధరహితమని చెబుతూనే.. సమ్మె అనైతికం అని కొందరు చెబుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలపైనా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. సమ్మెకు రాజకీయ పార్టీలు ఎలా మద్దతు ఇస్తాయని ప్రశ్నిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఆర్టీసీని విలీనం చేశాయా? అని అడిగారు. అంతేకాదు.. యూనియన్ల అలసత్వం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి పోతోందన్నట్లు చెప్పారు. ఆర్టీసీలో సమ్మె అనేదే నిషిద్ధమని ఆయన చెబుతుండటం కార్మికులపై ఆయన వైఖరి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో జ్వాలా నరసింహారావు రాసిన కథనం


  సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్న 48వేల మంది కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలోకి తీసుకునే ప్రస్తకే లేదని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఊటంకించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో అవసరం లేదని ఆయన తన కథనంలో పేర్కొనడం.. కార్మికుల ఆగ్రహానికి దారితీసింది. కార్మికుల అవసరమే లేదన్న జ్వాలా నరసింహారావు.. సమ్మెతో ఆర్టీసీ నష్టపోయిందని, కార్మికులు నష్టపోయారని, ప్రజలూ కష్టపడుతున్నారని చెప్పారు. కార్మికుల అవసరమే లేనప్పుడు.. వారిని సమ్మె విరమించాలని కోరడం దేనికన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రత్యేక కథనం రాసినందుకు జ్వాలా నరసింహారావుపై కార్మికులు, ప్రతిపక్షాలు, జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక జర్నలిస్టు వృత్తిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి కావని, కార్మికుల కడుపుకోత అర్థం చేసుకోలేని స్థితిలో ఆయన ఉన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  జ్వాలా నరసింహారావు వ్యాఖ్యలపై ప్రముఖ జర్నలిస్టు సతీష్ కమాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘వనం జ్వాలా నరసింహారావు గారు! ఆర్టీసీ యూనియన్ల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఆర్టీసీపై రాయితీల భారాన్ని మోపుతున్నదెవరో చెప్పరెందుకు? సామాజిక బాధ్యతను భుజాన మోస్తున్న ఆర్టీసీపై అలవిమాలిన పన్నుల భారం మోపుతున్నదెవరు? కార్మికుల కష్టార్జితం 500 కోట్ల రూపాయలను దారి మళ్ళించిందెవరు? ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా హస్తగతం చేసుకున్న వారెవరు? ఆర్టీసీకి కనీసం ఎండీని నియమించకుండా సంస్థను నిర్వీర్యం చేస్తోందెవరు? ఎక్కడెక్కడి రాష్ట్రాల గురించో ప్రస్తావించిన మీరు మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ సంగతి చెప్పే సాహసం ‌మాత్రం‌ చేయరెందుకు? మీరు నమ్మే మనుస్మృతిని తీసుకున్నా, చాణక్య నీతి చెప్పుకున్నా, పాలకుడు ‌తండ్రిలా ఉండాలే తప్ప కర్కోటకుడిలా కడుపులు కొట్టకూడదని ఎందుకు చెప్పలేకపోతున్నారు?’ అంటూ ప్రశ్నలు సంధించారు. ఆయనే కాదు.. పలువురు కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, మరికొంత మంది జర్నలిస్టులు జ్వాలా నరసింహారావు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఇదిలా ఉండగా,  ప్రభుత్వం కావాలనే ఈ రకమైన ప్రచారం చేయిస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: CM KCR, High Court, Telangana High Court, Telangana News, Telangana Politics, Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు