ప్రత్యేక హోదాపై ప్రధానికి జగన్ లేఖ... కేంద్ర బడ్జెట్‌పైనా సీఎం తీవ్ర అసంతృప్తి

సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీ

సీఎం కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి మీడియాకు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలు ప్రత్యేకహోదా కోరుతున్నాయని లేఖలో పేర్కొంది.

  • Share this:
    మరోసారి జగన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే.... ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్... ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆరునెలలు పూర్తవగానే... ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్రాన్ని కోరింది. పదిహేనవ ఆర్థిక సంఘం నివేదిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాశారు. దీన్ని సీఎం కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి మీడియాకు విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలు ప్రత్యేకహోదా కోరుతున్నాయని లేఖలో పేర్కొంది. ఇది ఆర్థికసంఘం పరిధిలోని అంశం కాదని.. కేంద్ర ప్రభుత్వమే పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థికసంఘం తన నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని, తెలంగాణకే ఎక్కువగా ఆదాయం వెళ్లిందన్నారు. అందువల్ల తమ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్‌ కోరారు.

    ఈ సందర్భంగా ఇంతవరకు కేంద్ర బడ్జెట్‌పై నోరు మెదపని జగన్...ఆ విషయంపై మోదీకి రాసిన లేఖలో మాత్రం స్పందించారు. కేంద్ర బడ్జెట్‌ ఎంతో ఆశాజనకంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం తగిన కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రత్యేకహోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం చేసిన సూచనలకు, 15వ ఆర్థికసంఘం నివేదికకు మధ్య వైరుధ్యం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నివేదికలోని అంశాలను పరిశీలించి ప్రత్యేకహోదాను ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్... రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి ప్రధాని చెప్పిన మాట వాస్తవమేనన్నారు. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో హోదా రద్దైపోయినట్లేనని అనురాగ్ ఠాకూర్ అన్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిని లిఖిత పూర్వక ప్రశ్నలకు ఎంపీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానం వచ్చారు. ఏపీ సీఎం జగన్ చేస్తున్న ఈ విజ్ఞప్తి పట్ల ప్రధాని మోదీ ఎలా స్పందించారో చూడాలి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండటంతో... ఈ సందర్భంగా ఏమైనా ప్రకటన చేస్తారా అనేది వేచి చూడాలి.
    Published by:Sulthana Begum Shaik
    First published: