తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ... రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. అందుకే, ఆదరాబాదరాగా తెలంగాణలోని 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించేసింది. ఇప్పుడు ఈ అంశమే రాష్ట్ర కాంగ్రెస్‌లో అగ్గి పెట్టింది. నేతల మధ్య విభేదాలు మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో కిరికిరి మొదలైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ... ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. అయితే, ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తా చూపింది. కూటమిగా 8 స్థానాలు గెలిచిన కాంగ్రెస్.. సొంతంగా 5 స్థానాలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాంటి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ముసలం పెట్టింది. తాజాగా అధిష్ఠానం ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాపై.. పలువురు నేతలు బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో.. బలంగా ఉన్న ఈ ఒక్క జిల్లాలోనూ కాంగ్రెస్ కథ కంచికేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేతల తీరు, కామెంట్లు చూస్తుంటే పరిస్థితి అలాగే అనిపిస్తోంది మరి.
ఇప్పటికే ఖమ్మం, కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుల నియామకంపై నేతల విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావును కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడిగా నియమించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే.. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ ప్రధానకార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. డీసీసీ అధ్యక్షుడి నియమాకంపై స్థానిక నేతనైన తనతో కనీసం చర్చించకపోవడం బాధించిందంటూ పీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖరాశారు. మరోవైపు, డీసీసీ అధ్యక్షపదవి కోరితే.. కొత్తగా ఖమ్మం సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని కట్టబెట్టడం పట్ల స్థానిక కార్పొరేటర్ దీపక్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా, పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సైతం అధిష్టానం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుల నియామకంలో సమతుల్యం లోపించిందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే పదవులు తమకే, డీసీపీ అధ్యక్ష పదవులూ తమకే అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారని.. ఎల్లకాలం తాము చెప్పిందే చెల్లుబాటు కావాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ వాళ్లకే పదవులు దక్కాలనుకోవడం కరెక్టు కాదన్నారు. ఖమ్మంలో ఒకే వ్యక్తి అనుచరుడికి పదవులు దక్కాయని విమర్శించారు. సొంత పార్టీలో రేగిన ఈ కుంపటి... బలంగా ఉందనకుంటున్న ఖమ్మం జిల్లాలో పరిస్థితిని దిగజార్చేలా కనిపిస్తోందని కాంగ్రెస్ క్యాడర్ భయపడుతోంది. అధిష్టానం కలుగజేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం తప్పకపోవచ్చని హెచ్చరిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mahakutami, Telangana Election 2018, Tpcc, TS Congress, Uttam Kumar Reddy