HOME » NEWS » politics » CLASHES BETWEEN AMANCHI KRISHNA MOHAN AND KARANAM BALARAM IN CHIRALA MS

కరణం, ఆమంచి పోరు కోర్టు దగ్గరే ఆగుతుందా..? లేక పచ్చని పల్లెల్లో అగ్గిరాజేస్తుందా..?

రెండు రోజుల క్రితం చీరాలలో సమావేశం ఏర్పాటు చేసిన కరణం బలరాం.. ఇక్కడ రావణపాలన అంతమైందని.. కార్యకర్తలకు అండగా ఉంటానని, ఎవ్వరూ భయపడొద్దని ప్రకటించారు. దీనికి రెండు రోజుల ముందే ఆమంచి కోర్టులో బలరాంపై పిటిషన్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: July 11, 2019, 3:09 PM IST
కరణం, ఆమంచి పోరు కోర్టు దగ్గరే ఆగుతుందా..? లేక పచ్చని పల్లెల్లో అగ్గిరాజేస్తుందా..?
ఆమంచి కృష్ణమోహన్,కరణం బలరాం (File Photos)
  • Share this:
ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం రంగులు మార్చుకుంటోంది. ఒకప్పుడు కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య ఏర్పడిన పరిస్థితులు ఇప్పుడు చీరాలలో ఏర్పడుతాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్‌లో ఓటర్లు బలరాంకి విజయాన్ని అందించారు.ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో పరిస్థితులు అనుకోని మలుపులు తీసుకుంటున్నాయి.

టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం.. తన ఎన్నికల అఫిడవిట్‌లో ముగ్గురు సంతానం మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారని.. కానీ, ఆయనకు నలుగురు సంతానం అని ఆమంచి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తప్పకుండా బలరాంపై అనర్హత వేటు పడుతోందని ఆమంచి మీడియాతో స్పష్టంగా చెప్పారు. కానీ, దీనిపై బలరాం ఇంత వరకూ స్పందించడం లేదు.ప్రకాశం జిల్లాలో కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య దశాబ్దాలు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. రెండు వైపులా కీలకమైన నేతలను, కుటుంబ సభ్యులను ఇరువర్గాలు కోల్పోయాయి. కానీ,రాజకీయంగా వీరు తలపడి ఓడిపోయిన సందర్భాల్లో కూడా తమకు అవకాశం వచ్చేవరకూ వేచిచూశారే కానీ, ఎప్పుడూ కుటుంబంలోని సమస్యలను తమ రాజకీయాలకు అనుకూలంగా మార్చుకోలేదు. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ మొదటిసారి కరణం బలరాంపై హైకోర్టులో దాఖలు చేసిన పిల్ విషయం దీనికి భిన్నంగా ఉంది. దీంతో బలరాం ఏవిధంగా ముందుకు వెళ్తారనేది సస్పెన్స్‌గా మారింది.

ఎన్నికల సమయంలో కూడా కరణం, ఆమంచి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ప్రకాశం జిల్లాలోనే చీరాల అత్యంత సమస్యాత్మక నియోజకర్గంగా ప్రకటించి చర్యలు తీసుకుంది. ఆమంచి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్పీ కోయ ప్రవీణ్‌ను విధుల నుంచి కూడా తప్పించింది. ఇది పోలీస్ శాఖలోనూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటూ ఢీకొనడంతో నియోజకవర్గంలో కూడా పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. రెండు రోజుల క్రితం చీరాలలో సమావేశం ఏర్పాటు చేసిన కరణం బలరాం.. ఇక్కడ రావణపాలన అంతమైందని.. కార్యకర్తలకు అండగా ఉంటానని, ఎవ్వరూ భయపడొద్దని ప్రకటించారు. దీనికి రెండు రోజుల ముందే ఆమంచి కోర్టులో బలరాంపై పిటిషన్ దాఖలు చేశారు.


ఎన్నికల అనంతరం రుద్రమాంబవరంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్ణణలో మనస్తాపం చెందిన పద్మ అనే కార్యకర్త కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇక్కడి నుంచే మాజీ సీఎం చంద్రబాబు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం టీడీపీ కార్యకర్త బంధువులు.. వైసీపీ కార్యకర్త కుటుంబంపై రుద్రమాంబపురంలో దాడిచేశారు. దీంతో అక్కడి పరిస్థితులు ఆమంచి, బలరాం మధ్య మరింత అగ్గిని రాజేసేలా ఉన్నాయి.

మంగళవారం వీటిని బలపరిచే విధంగా.. గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతో రవికుమార్ రెడ్డి అనే హోంగార్డును... ఆమంచి కృష్ణమోన్ సోదరుని కుమారుడు ఆమంచి రాజేంద్ర ఫోన్‌లో బెదిరించారు. ఇది మీడియాలో ప్రసారం అయినా.. పోలీసులు హోంగార్డు ఫిర్యాదుపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదు. దీంతో జిల్లాలో ఏ స్థాయిలో పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై స్పందన కోసం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌసల్‌తో మాట్లాడటానికి మీడియా నాలుగు గంటలు వేచి ఉన్నా కూడా ఆయన మాట్లాడటానికి ముందుకు రాలేదు. పోలీసులకే ఫోన్‌లలో కాళ్లూ... చేతులూ తీసేస్తామని బెదిరింపులు వస్తున్నా.. కేసు నమోదు చేశాం, చట్ట ప్రకారం ముందుకు వెళ్తామనే మాట 'ఆఫ్ ద రికార్డు' మాత్రమే చెప్తున్నారు. మరోవైపు.. జిల్లాలో చాలా గ్రామాల్లో టీడీపీ పాలనలో వేసిన శిలాఫలకాలు, రోడ్లు ధ్వంసం చేయడం జరుగుతున్నా? వీటిని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులు సైతం ఫిర్యాదులు చేయడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


అద్దంకి, చీరాల, పర్చూరు, కొండపిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న రుద్రమాంబపురం పర్చూరు నియోజకవర్గంలోనిది. కొండపి నియోజకవర్గంలోనూ టీడీపీ ఎమ్మెల్యే స్వామిని ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనకుండా వైసీపీ వారు అడ్డుకున్నారు. ఇప్పుడు చీరాలలోనూ కరణం బలరాంపై ఆమంచి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జిల్లాలో కరణం బలరాం.. ఆమంచి పిటిషన్ పై కోర్టులోనే తేల్చుకునే ఆలోచనలో ఉన్నా? ఇరుపార్టీల కార్యకర్తలు ఏదైనా గొడవలకు పాల్పడితే నేతలు కూడా అందులోకి రావాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో పరిస్థితులు చేయిదాటిపోతాయేమో అనే అనుమానాలు తలెత్తుకుతున్నాయి. ఆమంచి- కరణంల మధ్య పోరు కోర్టు దగ్గరే ఆగిపోతుందా? లేక గతచరిత్రను గుర్తుచేస్తూ.. పచ్చని పల్లెల్లో అగ్గిరాజేస్తుందా అనేది మున్ముందు తెలియనుంది.

(డి.లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Srinivas Mittapalli
First published: July 11, 2019, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading