అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణ... 796 మందిపై కేసులు నమోదు...

ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే... అడ్డగోలుగా భూములు కొన్నారన్న విషయంపై సీఐడీ విచారణ వేగంగా సాగుతోంది.

news18-telugu
Updated: January 23, 2020, 11:41 AM IST
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణ... 796 మందిపై కేసులు నమోదు...
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణ... 796 మందిపై కేసులు నమోదు...
  • Share this:
ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వైసీపీ ప్రభుత్వ ఆరోపణలతో... ల్యాండ్ పూలింగ్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ వేగంగా సాగుతోంది. ప్రధానంగా... తెల్ల రేషన్ కార్డులు ఉన్న 796 మంది అడ్డగోలుగా భూములు కొన్నట్లు సీఐడీ చెబుతోంది. వీళ్లందరిపై కేసు నమోదు చేసింది. ఎకరం రూ.3 కోట్ల చొప్పున మొత్తం 761 ఎకరాలు కొన్నారనీ... అలా... మొత్తం 796 మంది వైట్ రేషన్ కార్డు ఉన్నవారు... రూ.300 కోట్లతో భూములు కొన్నారని సీఐడీ గుర్తించింది. వీళ్లతో భూములు ఎవరు కొనిపించారో లెక్కలు రాబడుతోంది. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఏయే ప్రాంతాల్లో ఎన్నెన్ని ఎకరాల్ని ఎవరెవరు కొన్నారో లెక్కలు తేల్చుతున్నారు. ఐతే... ఈ భూముల కొనుగోళ్లన్నీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కిందకే వస్తాయా లేక మామూలుగా కొన్నారా అన్నది తేలాల్సి ఉంది.

పెద్దకాకానిలో 43 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌... 40 ఎకరాలు కొన్నారు. అలాగే... తాడికొండలో 180 ఎకరాలు కొన్నారు 188 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌. ఇక తుళ్లూరులో 243 ఎకరాలు కొన్నారు 238 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌. మరి మంగళగిరిలో 148 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ 133 ఎకరాలు కొన్నారు. అలాగే తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్నారు 49 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌.

2014లో ఏపీ ప్రభుత్వం మొదట విజయవాడను రాజధానిగా ప్రకటించాలనుకొని... చివరకు అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఐతే... అలా ప్రకటించే ముందే... టీడీపీకి చెందిన నేతలు, ఆ నేతలకు చెందిన బినామీలూ కలిసి... అమరావతి, ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు చేపట్టారనీ, రాజధాని ప్రకటనకు ముందే ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిపారని... వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై సీఐడీ విచారణలో ఏం తేలుతుందన్నది ఆసక్తి రేపుతోంది. భూములు కొన్నవారు మాత్రం... తాము సహజంగానే భూములు కొన్నామనీ... ఆ తర్వాత ప్రభుత్వం రాజధానిని అక్కడ ప్రకటిస్తే... అందులో తమ తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. సీఐడీ విచారణ తర్వాత ఇచ్చే రిపోర్టు, దానిపై ప్రభుత్వం తీసుకునే చర్యల్ని బట్టీ ఈ అంశం ఎంతదాకా వెళ్తుందన్నది ఆధారపడి ఉంటుంది.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు