చిరంజీవి, రామ్ చరణ్‌తో భేటీ వెనుక... జగన్ వ్యూహం ఇదే ?

సాధారణ భేటీతో సరిపెట్టకుండా చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ను జగన్ లంచ్ మీటింగ్ కు ఆహ్వానించడం వెనుక ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

news18-telugu
Updated: October 14, 2019, 9:40 AM IST
చిరంజీవి, రామ్ చరణ్‌తో భేటీ వెనుక... జగన్ వ్యూహం ఇదే ?
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మరికొద్ది గంటల్లో భేటీ కాబోతున్నారు. తన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రత్యేక షో చూసేందుకు జగన్ ను ఆహ్వనించేందుకు చిరంజీవి అపాయింట్ మెంట్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి భేటీలో అంతకు మించిన విషయాలే చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ చరిత్రలో ఓ కీలక మలుపుకు దారి తీసినా ఆశ్చర్యం లేదనే ప్రచారం జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గం చేతుల్లో ఉన్న టాలీవుడ్ నుంచి జగన్ కు మద్దతు లభించడం లేదని ఇప్పటికే ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీరాజ్ పలుమార్లు మొత్తుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.

దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం సాగించిన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతీదీ ఓ సంచలనమే. ముఖ్యంగా నాలుగు కుటుంబాల చేతిలో టాలీవుడ్ ఇండస్ట్రీ చిక్కుకుందనే వాదన ఎప్పటినుంచో ఉంది. కమ్మ సామాజిక వర్గం చేతుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా టాలీవుడ్ పెద్దలంతా దశాబ్దాలుగా అండగా నిలిచారు. మద్దతుతో సరిపెట్టకుండా ప్రతిసారీ ఎన్నికల్లోనూ అన్ని విధాలుగా ఆ పార్టీకి చేదోడువాదోడుగా ఉన్నారు. మురళీమోహన్, అశ్వనీదత్, రామానాయుడు, శారద, కైకాల సత్యనారాయణతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు టీడీపీ తరఫున గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో టీడీపీ తరఫున వేణుమాథవ్, అలీ, నరేష్ తో పాటు పలువురు నటీనటులు ప్రచారం కూడా నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు గత టీడీపీ ప్రభుత్వం అవకాశమిచ్చింది. అదే సమయంలో నిర్మాత అంబికా కృష్ణకు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఓ విధంగా చెప్పాలంటే టాలీవుడ్ - టీడీపీ బంధం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ ప్రభుత్వాన్ని మట్టికరిపించి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ను అభినందించేందుకు టాలీవుడ్ తరఫున ఎవరూ ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని ఎస్వీబీసీ ఛైర్మన్ గా ఉన్న హాస్యనటుడు పృధ్వీరాజ్ ఇప్పటికీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీంతో సహజంగానే కమ్మ సామాజిక వర్గం అధికారం చేపట్టలేదు కాబట్టి తమకెందుకులే అన్న భావనలో టాలీవుడ్ పెద్దలు ఉండిపోయినట్లు అర్ధమవుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో చిత్ర పరిశ్రమల్లో కమ్మ సామాజికవర్గం తర్వాత మెజారిటీగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని చేరదీస్తే ఎలా ఉంటుందన్న భావన వైఎస్ఆర్సీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే చిరంజీవి-జగన్ భేటీకి తెరవెనుక భారీ ప్రయత్నాలే జరిగినట్లు తెలుస్తోంది. సాధారణ భేటీతో సరిపెట్టకుండా చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ను జగన్ లంచ్ మీటింగ్ కు ఆహ్వానించడం వెనుక ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమను విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని ప్రచారం సాగుతున్న తరుణంలో కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇండస్ట్రీలో కుల సమీకరణాలను మార్చేయాలన్న ఉద్దేశం వైసీపీ తరఫున తెరవెనుక పావులు కదుపుతున్న వారికి ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ విషయంలో కనీస మర్యాద పాటించని టాలీవుడ్ పెద్దలను తాము కూడా ఎందుకు లెక్క చేయాలన్న భావన వైసీపీ ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. అందుకే ఇకపై కాపు సామాజికవర్గానికి పెద్ద పీట వేస్తూ విశాఖకు చిత్ర పరిశ్రమ తరలించేందుకు వైసీపీ ప్రయత్నించవచ్చన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను మార్పులు తప్పకపోవచ్చు. ఈ మొత్తం పరిణామాల్లో చిరు-జగన్ భేటీ తొలి అడుగు మాత్రమేనన్నది ఇండస్ట్రీతో పాటు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)
First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు