news18-telugu
Updated: August 10, 2019, 11:03 AM IST
తెలుగుదేశం పార్టీ లోగో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టీడీపీ ఎమ్మెల్యే ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నామనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఆయన ఎవరో కాదు ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం. చీరాలలో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ మీద కరణం బలరాం విజయం సాధించారు. అయితే, అప్పటి నుంచి వైసీపీ నేతలకు ఆయన మింగుడుపడడం లేదు. నియోజకవర్గంలో ఏం జరిగినా ఆయనే పెత్తనం చెలాయిస్తున్నారని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, చీరాలలో మాత్రం ఆయన హవానే నడుస్తోందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరణం బలరాం మీద పోటి చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్‌కు ఇది మింగుడు పడడం లేదు. ఇటీవల గ్రామ వాలంటీర్ల అంశంలో కూడా కరణం బలరాం తన పట్టును నిలుపుకొంటున్నారని చెబుతున్నారు. గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించి కరణం బలరాం ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించి, తనకు తెలిసిన వారిని గ్రామ వాలంటీర్లుగా సెలక్ట్ అయినట్టు జాబితాలో వారి పేర్లు చేర్చారని ఆమంచి ఆరోపిస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్న కరణం బలరాంపై చర్యలు తీసుకోవాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు.
చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ నేతగా తాను చెప్పినట్టే వినాలని అధికారుల మీద ఆమంచి కృష్ణ మోహన్ ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఎమ్మెల్యే అయిన తాను చెప్పినట్టే నడుచుకోవాలంటూ కరణం బలరాం ప్రెజర్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య అధికారులు నలిగిపోతున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 10, 2019, 11:03 AM IST