ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో పళ్లం రాజు.. మరో ముగ్గురు..

ఏపీ పీసీసీ చీఫ్‌గా పల్లంరాజు

పళ్లం రాజుతో పాటు చింతామోహన్, శైలజానాథ్, సుంకర పద్మ కూడా ఏపీ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్ కోసం వేట కొనసాగుతోంది. కేంద్ర మాజీ మంత్రి ఎం.పళ్లంరాజును ఏపీ పీసీసీ చీప్‌గా  నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఓటమికి బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న రఘువీరా రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు.  2019 ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆయన హైకమాండ్‌కు తన రాజీనామా పత్రం సమర్పించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారు. దీంతో ఆ బాధ్యతల్ని పల్లంరాజుకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే, పీసీసీ చీఫ్ రేసులో పళ్లం రాజుతో పాటు మరో ముగ్గురు నేతలు కూడా ఉన్నారు. మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్, మాజీ మంత్రి శైలజానాథ్, ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన సుంకర పద్మ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టు తెలిసింది.


  కాంగ్రెస్ సీనియర్ నేత అయిన పళ్లంరాజు కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పలుసార్లు గెలుపొందారు. 1989లో కాకినాడ లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1995లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1997నుంచి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.  2004 ఎన్నికల్లో రెండోసారి లోక్ సభకు కాకినాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం మన్మోహన్ సింగ్ కేబినెట్ లో 2006 నుంచి 2009 వరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు.

  2009లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి కూడా గెలుపొందారు. మళ్లీ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రక్షణ మంత్రిగా కొనసాగారు. అయితే 2012లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రక్షణ శాఖ మంత్రి నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. పళ్లంరాజు కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులుగా పేరుంది. పళ్లంరాజు తండ్రి శ్రీరామ సంజీవరావు కూడా మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. చింతామోహన్ కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎప్పుడూ కమ్మ, రెడ్డి సామాజికవర్గానికే చెందిన నేతలు రాజ్యాన్ని ఏలుతున్నారని, ఇతర వర్గాలకు అధికారం ఇవ్వరా అంటూ గతంలో ఆయన కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు.
  Published by:Sulthana Begum Shaik
  First published: