మంగళవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. తాజాగా ఢిల్లీ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీని పొడగించడంతో చిదంబరం జైల్లోనే ఉండనున్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఈడీ కస్టడీని ఢిల్లీ కోర్టు అక్టోబర్ 30 వరకు పొడగించింది. దీంతో దీపావళి పండుగ రోజున ఆయన జైల్లోనే గడపనున్నారు. మంగళవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. తాజాగా ఢిల్లీ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీని పొడగించడంతో చిదంబరం జైల్లోనే ఉండనున్నారు. ఈడీ కస్టడీలో చిదంబరానికి ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ప్రత్యేక సెల్,వెస్ట్రన్ టాయిలెట్,కళ్లద్దాలు,మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.అలాగే రోజుకు అరగంట చొప్పున కుటుంబ సభ్యులు లేదా బంధువులతో కలిసేందుకు అవకాశం కల్పించింది.
కాగా,ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను అగస్టు 21న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా ఒప్పందం జరిగినప్పుడు చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ సంస్థలోకి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్దంగా కంపెనీలోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం దీనిపై సీబీఐ,ఈడీ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి.