news18-telugu
Updated: September 6, 2019, 10:45 AM IST
చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలిస్తున్న దృశ్యం (PTI)
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మాజీ కేంద్రమంత్రి చిదంబరంను తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నెల 19 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం గతంలో ఉన్న నంబర్ ఏడు జైల్లోనే ఆయన్ను ఉంచారు. తనకు ప్రత్యేక గది,బాత్రూమ్,జడ్ కేటగిరి భద్రతా సదుపాయాలు కల్పించాలన్న చిదంబరం చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దీంతో మొదటిరోజు జైల్లో చిదంబరం నిద్రలేని రాత్రిని గడిపాడు. ఈ మేరకు జైలు సిబ్బంది నుంచి సమాచారం అందిందని ఇండియా టుడే కథనాన్ని ప్రచురించింది.
గురువారం రాత్రి తీహార్ జైల్లో చిదంబరం స్వల్ప ఆహారం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 6గంటలకు బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా చిదంబరంకు జైలు సిబ్బంది టీ,బ్రెడ్, పోహ,ఓట్ మీల్ అందించారు. తన జైలు గది బయట నడిచేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మిగతా ఖైదీల్లాగే చిదంబరం కూడా తీహార్ జైల్లోని లైబ్రరీకి వెళ్లేందుకు.. అక్కడ టీవీ చూసేందుకు అనుమతినిచ్చారు. అలాగే ప్రతీరోజూ ఆయన సెల్‌కు వార్తా పత్రికను కూడా పంపించనున్నారు. సెల్లో పడుకునేందుకు ఒక బ్లాంకెట్,తల కింద పెట్టుకునేందుకు మెత్త ఇచ్చారు. చిదంబరం జైల్లో ఇచ్చే నీటిని తాగవచ్చునని లేదా క్యాంటీన్ నుంచి వాటర్ బాటిల్స్ కొనుక్కోవచ్చునని అధికారి ఒకరు తెలిపారు.
ఇదిలా ఉంటే,కాంగ్రెస్‌లో బలమైన గొంతు కలిగిన నేతల్లో ఒకరైన చిదంబరం జైలుపాలు కావడం ఆ పార్టీని కలవరపెడుతోంది.నరేంద్ర మోదీ సర్కార్ నిర్ణయాలను కాంగ్రెస్ తరుపున బలంగా విమర్శించిన నేత ఇప్పుడు జైల్లో ఉండటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.
Published by:
Srinivas Mittapalli
First published:
September 6, 2019, 10:45 AM IST