పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, వైసీపీపై టీడీపీ ప్రయోగించనున్న అస్త్రం...

అమరావతి అంశం మీద పార్లమెంట్ సమావేశాలు జీరో అవర్‌‌లో ప్రస్తావించాలని లేకపోతే ప్రత్యేకంగా దీనిపై చర్చకు నోటీసు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది.

news18-telugu
Updated: November 16, 2019, 10:57 PM IST
పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, వైసీపీపై టీడీపీ ప్రయోగించనున్న అస్త్రం...
టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం (Image;TDP/Twitter)
  • Share this:
ఈనెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై అయా పార్టీలు వ్యూహాలు రచించాయి. రాష్ట్రాల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తే వాటికి ఎలా కౌంటర్ ఇవ్వాలని కూడా సిద్ధమయ్యాయి. అలాగే, కేంద్రం మీద ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే విషయంపై కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార విపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కూడా పార్లమెంట్ సమావేశాల కోసం తన అస్త్రాన్ని సిద్ధం చేసింది. అమరావతే టీడీపీ ప్రధాన అస్త్రం కానుంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేశారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాజధాని మీద సందిగ్ధత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత దేశ మ్యాప్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేకుండానే ప్రచురించారు. ఈ క్రమంలో అమరావతి మీద టీడీపీ పార్లమెంట్‌లో పట్టు బట్టాలని నిర్ణయించింది.

అమరావతి మీద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది. తాము ఏం చేసినా మోదీ, అమిత్ షా‌కు చెప్పే చేస్తున్నామని, తాము చేసే పనులకు వారిద్దరి అంగీకారం ఉందని గతంలో విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అమరావతి విషయంలో కూడా మోదీ, షా అందుకు అంగీకరించారా? అనే అంశాన్ని లేవనెత్తనున్నారు. దీంతోపాటు తాజాగా అమరావతికి సంబంధించిన పలు ఒప్పందాలను జగన్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. తాజాగా అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టును సింగపూర్‌తో ఏపీ ప్రభుత్వం రద్దు చేసుకుంది.గతంలో పలు విద్యుత్ అగ్రిమెంట్లను కూడా ప్రభుత్వం సమీక్షిస్తామని చెప్పింది. ఇవన్నీ పరిశీలిస్తే.. కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావని టీడీపీ వాదిస్తోంది.

అమరావతి అంశం మీద పార్లమెంట్ సమావేశాలు జీరో అవర్‌‌లో ప్రస్తావించాలని లేకపోతే ప్రత్యేకంగా దీనిపై చర్చకు నోటీసు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు అమరావతి మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ రిపోర్టు ఈనెలాఖరు నాటికి ప్రభుత్వానికి అందజేయనుంది. ఇప్పటికే ప్రజల నుంచి పలు సూచనలు సలహాలు తీసుకుంది.
First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading