Home /News /politics /

CHANDRABABU NAIDU WRITES TO GOVERNOR BISWABHUSHAN HARICHANDAN COMPLAINTS ABOUT YSRCP GOVT BA

మీరే జోక్యం చేసుకోవాలి.. గవర్నర్ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ..

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరించి వేస్తోందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని కూడా అరెస్టు చేస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల మీద కూడా ఆయన ఫిర్యాదు చేశారు.

    చంద్రబాబునాయుడు రాసిన లేఖ...
    ‘వైఎస్ఆర్సీపీ 2019లో అధికారం చేపట్టినప్పటి నుండి, రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన అరెస్టులు, ప్రజల అక్రమ నిర్బంధాలు పెరిగి పోయాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించివేస్తోంది. పోలీసులలో కొందరితో కుమ్మక్కై అధికార పార్టీ సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తోంది, తమను వ్యతిరేకించేవారిని ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుంటోంది. స్వల్ప విమర్శలపై కూడా, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పోలీసులు అత్యంత అమానవీయ, అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు.

    ఉదాహరణకు, కారులో తరలిస్తున్న రూ 5.27 కోట్లు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుల వద్ద తమిళనాడు పోలీసులు పట్టుకున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, నాయుడుపాలెం గ్రామంలోని వడ్డెల సందీప్ కుమార్, తొట్టెంపూడి చంద్రశేఖర్ లను 2020 జూలై 16న అరెస్టు చేశారు. ఇదే వార్తలు, తమిళనాడు అంతటా తమిళ మీడియాలో ప్రసారం అయ్యాయి. ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుండి భారీ మొత్తంలో నగదును అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులపై సమగ్ర విచారణ చేయడం, వారిపై కఠినమైన చర్యలు తీసుకోడానికి బదులుగా, 2020 జూలై 16 న మధ్యాహ్నం 1 గంటలకు సందీప్, చంద్రశేఖర్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఒంగోలు గ్రామీణ పోలీసులు, ఆ తర్వాత వారిని ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్ కు, 3స్టేషన్లు తిప్పుతూ దారుణంగా కొట్టడమే కాకుండా భౌతికంగా హింసించారు.

    ఇటువంటి భౌతిక హింస, పోలీసులతో దారుణంగా కొట్టించడం వంటి దుశ్చర్యలకు నాగరిక సమాజంలో, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానం లేదు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19 ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులను, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించే చర్యలే... భారత రాజ్యాంగం గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్న వ్యాఖ్యలు, ‘‘ మన రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం కాదు, అదొక జీవన నౌక(లైఫ్ వెహికల్), దాని ఆత్మ ప్రతినిత్యం సజీవం’’ అని అంబేద్కర్ చెప్పిన సూక్తిని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.

    ప్రస్తుతం మనరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో, బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నరాజ్యాంగ 'ఆత్మ' ప్రత్యక్ష, పరోక్ష దాడికి గురైంది. ఈ రోజు మన రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ చెప్పిన 'జీవన నౌక(లైఫ్ వెహికల్)' తప్పుడు బాటలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ, పునరుద్దరణలో భాగంగా, సందీప్, చంద్రశేఖర్ లకు చట్ట ప్రకారం సత్వర న్యాయం అందించేలా మీ గురుతర జోక్యం తక్షణ అవసరం. ఈ అంశంలో మీ గురుతర జోక్యం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, సమాజంలోని వ్యవస్థల విలువలపై యువతరంలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.’
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP governor viswabhushan, Chandrababu naidu, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు