ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేయాలని భావిస్తున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబు ఢిల్లీ దీక్ష అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేస్తే ఎలా ఉంటుందని చర్చించారు. ఢిల్లీలో ఒకరోజు దీక్ష చేయాలని భావిస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే ఐదేళ్ల పాలనా కాలంలో ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఈసారైనా రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధించుకోవడానికి పోరాడాలని భావిస్తున్నారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చూస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కేంద్రం మధ్యంతర బడ్జెట్ కాకుండా ఫుల్ బడ్జెట్ పెడితే, అందులో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూసి, ఆ తర్వాత దీక్ష చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే బీజేపీకి, టీడీపీకి మధ్య అగాథం ఏర్పడింది. రాష్ట్రానికి అన్యాయం చేస్తోందంటూ టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా, రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విబేధాలు ఉన్నాయి. రాష్ట్రానికి మొత్తం రూ.1.25లక్షల కోట్ల నిధులు రావాలని చంద్రబాబు చెబుతున్నారు.
2019 లోక్సభ ఎన్నికల సమయంలో జాతీయంగా కీలక పాత్ర పోషించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. దానికి తగ్గట్టే అడుగులు కూడా వేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చంద్రబాబు చేపట్టబోయే దీక్ష కూడా అందుకు ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp-tdp, Chandrababu naidu, New Delhi