తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీద జగన్ ప్రభుత్వం అన్యాయంగా నిర్భయ కేసు పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. బీసీ నేతలను టార్గెట్గా చేసుకుని ఇలా వ్యవహరిస్తోందన్నారు. ‘అయ్యన్నపై అక్రమ కేసు వైసీపీ కక్ష సాధింపునకు మరో రుజువు. 4రోజుల్లో ముగ్గురు బీసీ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు, బీసీలపై సీఎం జగన్ అక్కసుకు నిదర్శనం. రాష్ట్రంలో బీసి నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ కుట్ర. ఒకవైపు బీసీ సంక్షేమంలో కోతలు, బీసీ వెల్ఫేర్ స్కీమ్ ల రద్దు, మరోవైపు బీసీ నాయకులపై తప్పుడు కేసులు.. బీసీలపై సీఎం జగన్ కక్ష సాధింపునకు అద్దం పడుతున్నాయి. 4 రోజుల క్రితం అచ్చెన్నాయుడి అరెస్ట్, మొన్న యనమల రామకృష్ణుడుపై కేసు, ఈ రోజు అయ్యన్నపాత్రుడిపై తప్పుడు కేసు... బీసీలపై జగన్ దుర్మార్గాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు.’ అని చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. తప్పుడు కేసులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పగ-ప్రతీకారాలు తీర్చుకోవాలని చూడటం శాడిజమని మండిపడ్డారు.
రాష్ట్రంలో బీసీలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ కక్ష సాధింపునకు బుద్ది చెప్పాలన్నారు. బీసీ సంఘాలన్నీ సీఎం జగన్ దుశ్చర్యలను గర్హించాలన్నారు. వైసీపీ దురాగతాలను అన్నివర్గాల ప్రజలు ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ అరాచకాలపై రాజీలేని పోరాటం చేస్తున్న టీడీపీకి అండగా నిలబడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.