విశాఖలో ఉత్కంఠకు తెర... హైదరాబాద్‌కు చంద్రబాబు

విశాఖలో పరిస్థితిని గుర్తించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వెంటనే వైజాగ్ వెళ్లారు. విమానాశ్రయంలో చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

news18-telugu
Updated: February 27, 2020, 8:48 PM IST
విశాఖలో ఉత్కంఠకు తెర... హైదరాబాద్‌కు చంద్రబాబు
విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు
  • Share this:
విశాఖలో ఉదయం నుంచి జరుగుతున్న పొలిటికల్ ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ నుంచి హైదరాబాద్ తిరుగుప్రయాణం అయ్యారు. చంద్రబాబును విజయవాడ పంపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, విజయవాడకు విమానాలు లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్ పంపారు. దీంతో ఉదయం నుంచి విశాఖలో జరుగుతున్న రాజకీయ వేడి చల్లారింది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబు అనుకున్నారు. ఈ రోజు విశాఖ, రేపు విజయనగరం జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే, విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు దిగిన తర్వాత వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున చంద్రబాబును అడ్డుకున్నాయి. విశాఖలో పరిపాలనా రాజధాని వద్దన్న చంద్రబాబును తప్పుపడుతూ బాబు కాన్వాయ్ మీద కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. దీంతోఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

విశాఖ నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు


విశాఖలో తన కాన్వాయ్ మీద కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారని, ఈ రోజు తనకు ఎదురైనే పరిస్థితే రేపు ప్రజలకు కూడా ఎదురవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.‘విశాఖ, విజయనగరం పర్యటనకు అనుమతి తీసుకున్నా. వైసీపీ వాళ్లు డబ్బులిచ్చి మనుషులను తెచ్చి దాడికి ప్రయత్నించారు. కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు, ఒకరిద్దరు రాళ్లు కూడా విసిరారు. పోలీసులు అరగంట తర్వాత పంపిస్తామన్నారు. ఇప్పుడు విమానాశ్రయానికి వెళ్లమంటున్నారు. అరెస్ట్ చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బెదిరిస్తున్నారు. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ, ఏ చట్టం ప్రకారమో ముందు నోటీసులు ఇవ్వండి’ అని చంద్రబాబు అన్నారు. తనను అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి ఆయన తీవ్రంగా స్పందించారు. ‘నన్ను షూట్ చేయండి. ఎన్‌కౌంటర్ చేయండి.’ అని వ్యాఖ్యానించారు. దీంతో పోలీసులు ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 151 ప్రకారం ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్టు నోటీసు ఇచ్చారు.

చంద్రబాబును ముందుస్తు అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసుల నోటీసు


ఉదయం నుంచి చంద్రబాబు ఎయిర్‌పోర్టు దాటనివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో చంద్రబాబు రోడ్డు మీద బైఠాయించారు. చంద్రబాబుకు భద్రతా కారణాల రీత్యా ఆయన్ను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌కు తరలించారు.

విశాఖలో పరిస్థితిని గుర్తించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వెంటనే వైజాగ్ వెళ్లారు. విమానాశ్రయంలో చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజ్ లో చంద్రబాబుతో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా భేటీ అయ్యారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 27, 2020, 8:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading